
బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాతంలో నిర్మించిన తారకేశ్వరాలయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 2016లో దీని నిర్మాణ పనులు ప్రారంభించి.. 2023లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామానికి చెందిన దశరథమహారాజు సముద్రతీరంలో శివాలయం నిర్మించాలనే తలంపుతో తిరుపతికి చెందిన స్థపతి గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లాకు చెందిన శిల్పి బ్రహ్మంను సంప్రదించారు. అనంతరం వారు చాళుక్యుల నాటి శిల్పశైలితో కృష్ణశిలలతో ఆలయం నిర్మించారు. ఇక్కడ తారకేశ్వరస్వామి, అన్నపూర్ణ అమ్మవారు, విజయరాజ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణానికి కోటప్పకొండ నుంచి 10 వేల ఘనపుటడుగుల కృష్ణశిలలను సేకరించారు. కంచి నుంచి ప్రత్యేకమైన శిలలను తెప్పించి కర్ణాటక శిల్పులతో విగ్రహాలు తయారు చేయించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఆలయ నిర్మాణంలో పని చేశారు.