News

బస్తర్ లో 20 మంది కీలక మావోల లొంగుబాటు.. నక్సలిజానికి దెబ్బపై దెబ్బ

166views

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల మూడో తేదీన (బుధవారం) మావోయిస్టు భావజాలంతో తాము విసిగిపోయామని, అందులో వున్నదంతా డొల్లే అన్న విషయాన్ని తాము గ్రహించామని, అందుకే లొంగిపోతున్నామని వారు ప్రకటించారు. ఈ విషయాన్ని బస్తర్ సీఆర్పీఎఫ్ పోలీసులు కూడా ధ్రువీకరించారు. 20 మంది మావోయిస్టులు లొంగి పోయారని ప్రకటించారు. ఈ బృందంలో 9 మంది మహిళా మావోయిస్టులు కూడా వున్నారు.

మావోయిస్టు ఉద్యమంలో విపరీతమైన గ్రూపిజం పెరిగిపోయిందని, అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని, వాటితో విసుగు చెందే మావోయిస్టులు లొంగిపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, లొంగిపోయిన నక్సలైట్ల కోసం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలకు కూడా ఆకర్షితులైనట్లు పేర్కొన్నారు.

లొంగిపోయిన నక్సలైట్లలో 11 మంది వద్ద రూ.33 లక్షల బహుమతి ఉంది. లొంగిపోయిన క్యాడర్‌లో ఒకరైన ఉయికా భీమే పిఎల్‌జిఎ బెటాలియన్ నంబర్ 1 సభ్యురాలు, ఇది మావోయిస్టు సంస్థలో క్రియాశీలకంగా వున్నారు. ఉయికే తలపై రూ.8 లక్షల బహుమతి ఉంది.

లొంగిపోయిన వారిలో పశ్చిమ బస్తర్ డివిజన్ సభ్యురాలు తాటి అలియాస్ పర్మిలా రూ. 8 లక్షల రివార్డుతో, ఏరియా కమిటీ సభ్యుడు ముచాకి హిడ్మా రూ. 5 లక్షల రివార్డుతో ఉన్నారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ మావోయిస్టులందరూ ఆయుధాలు వదులుకుని ప్రధాన స్రవంతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రిందటే 20 మంది లొంగుబాటు
ఇక.. మొన్ననే మరో 20 మంది నక్సలైట్లు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. దీని నుంచి కోలుకునే లోపే నక్సలైట్లకు మరో దెబ్బ తగిలింది. తాజాగా 20 మంది నక్సలైట్లు కూడా లొంగిపోయారు. బస్తర్ లో 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏకంగా 8 లక్షల రివార్డు వున్న కీలక నక్సలైట్ సోను హేమ్లా అలియాస్ కరోటి కూడా లొంగిపోయాడు. మరో 20 మంది మావోయిస్టులపై 81 లక్షల సమష్టి రివార్డు వుంది. వీరు కూడా లొంగిపోయారు.

తామంతా నక్సలిజం లో వున్న డొల్లతనం, అంతర్గత చీలికలు, సైద్ధాంతిక నిబద్ధత లేకపోవడం, చీలికలు, పేలికలు, గ్రూపిజం కారణంగానే విసుగు చెందామని, నక్సలిజంలో ఏమీ లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం రూపొందించిన ‘‘నియాద్ నెలనార్’’ పథకంతో కూడా బాగా ఆకర్షితులయ్యామని, పునరావాస పథకాలు బాగున్నాయని నక్సలైట్లు ప్రకటించారు.మావోయిస్టు గ్రూపు నుండి విడిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 తక్షణ ఆర్థిక సహాయం అందించారు.అలాగే రాష్ట్ర పునరావాస విధానం యొక్క ప్రయోజనాలను అందజేయనున్నారు.