
ధర్మస్థల-దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం. అక్కడ మంజునాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంటే శివుని రూపమే. బెంగళూరు నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహా పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది హిందువులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో కొన్ని దుష్టశక్తులు, జాతి విద్రోహశక్తులు ‘శవ’ పంచాయతీ పెట్టి అపవిత్రం చేయాలని చూశాయి. శవ రాజకీయాలు చేసి అప్రతిష్ట పాల్జేయడానికి యత్నించాయి.
హిందూత్వం మీద ద్వేషంతో ఎంత నీచానికయినా దిగజారే ఇలాంటి వాళ్లెవరికీ నీతినియామాలు లేవు. రాజకీయం కోసం వీళ్లంతా సృష్టించిన ‘‘గుట్టల కొద్దీ’’ శవాల మీద కొన్ని యూట్యూబ్ చానళ్లు పేలాలు ఏరుకుతిన్నాయి. సామూహిక ఖననాలు జరిగాయంటూ అమ్ముడు పోయిన ఒక వ్యక్తి చేత చెప్పించారు. ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం పవిత్రత మీద, హిందువుల విశ్వాసాల మీద దొంగదాడి చేయడమే లక్ష్యంగా ధర్మస్థల వివాదం నడిపించారు. దీనికి కాంగ్రెస్, సామాజిక కార్యకర్తల ముసుగులో ఉండే కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్, ఒక ముస్లిం యూట్యూబర్ తమ వంతు సాయం చేశారు. పరమ జుగుప్సాకరమైన తమాషా చూపించాలని అనుకున్నారు.
ఒక ప్రఖ్యాత హిందూ దేవాలయం ఖ్యాతిని మసక పరిచే ప్రయత్నంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాల మీద సమ్మెటతో మోదారు. ఆ ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా, గొప్ప సేవా దృక్పథంతో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న జైనబంట్ కుటుంబాన్ని వీధి పాల్జేయాలన్న దురుద్దేశంతోనే ఇదంతా చేశారని చివరికి బయటపడిపోయింది. చివరికి ధర్మస్థలలో ధర్మానిదే పైచేయి అయింది. శవాల గుట్టు బయటపడిపోయింది. అంతా కుట్ర అని తేలింది. బీజేపీ మీద రాజకీయ పోరాటం పేరుతో హిందూధర్మం మీద యథేచ్ఛగా సాగిపోతున్న దాడిలో ఇదొక భాగం మాత్రమేనని స్పష్టమైంది. ఇప్పుడు కర్ణాటక పోలీస్ వ్యవస్థ పరువు, కర్ణాటక ప్రభుత్వ ప్రతిష్ట మొత్తం కుళ్లిన శవం కంటే జుగుప్సాకరంగా ఉందంటే తొందరపాటు కాదు.
ధర్మస్థల చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో వందలాది యువతుల శవాలను పూడ్చిపెట్టారని, అవన్నీ లైంగిక అత్యాచారాలకు గురైన వారివేనని ఒక వ్యక్తి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెప్పడంతో దేశం నిర్ఘాంతపోయింది. తన చేతులతోనే డెబ్బయ్ ఎనభయ్ భౌతికకాయాలను అటవీ ప్రాంతంలో పాతి పెట్టానని అతడు చెప్పడం తీవ్ర సంచలనం సృష్టిం చింది. అక్కడ ఉన్న నేత్రావతి నదీతీరంలో ఈ ఘోరం జరిగిందని అతడు చెప్పుకొచ్చాడు. దాదాపు నెలరోజుల పాటు అత్యంత ఉత్కంఠను నింపిన ఈ ఉదంతం చివరికి పెద్ద అబద్ధమని తేలిపోయింది. ఇది హిందూ బంధువుల గుండెల మీద బరువు దిగినట్టు తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న ఆ భారీ కుట్ర మన ధర్మం, పుణ్యక్షేత్రాల భవిష్యత్తు గురించిన ప్రశ్నల బరువును ఎంతో పెంచింది. అమ్ముడుపోయిన కొందరు వ్యక్తులు చెప్పిన మాటలు పట్టుకుని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఆదరాబాదరాగా నియమించింది? వేలాది శవాలను పాతిపెట్టానని ఒక తాగుబోతు అంటే, ఆ మాట ఆధారంగా పోలీసు యంత్రాంగం తక్షణమే ఎందుకు రంగంలో దిగిపోయింది?
కుట్రకు ఆరంభం
జూన్ 22న ఇద్దరు న్యాయవాదులు సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఒక లేఖతో గొడవ మొదలయింది. నిజానికి పాత రగడకు ఊపిరి పోసినట్టయింది. ఓజస్వి గౌడ, సచిన్ ఎస్ దేశ్‌పాండే అనే ఆ ఇద్దరు ధర్మస్థలలో వందలాది శవాలను సామూహిక ఖననం చేశారని లేఖలో ఆరోపించారు. దీనికి బలం చేకూర్చుతూ, దేశం దృష్టి అటు మళ్లించేటట్టు చేసే పరిణామం జూలై 4న జరిగింది. నఖశిఖ పర్యంతం ముసుగు ధరించి వచ్చి, ముసుగు మనిషి పేరుతో మాధ్యమాలలో ప్రసిద్ధుడైన, ఇంతకాలం హిందువుల మనసులను బాధపెట్టిన వ్యక్తి ఆరోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్త దగా ఆరంభమైంది. సీఎన్ చెన్నయ్య అన్న ఆ ముసుగు మనిషి పేరు బయటపడడానికి కొన్ని వారాలే పట్టింది. కేవలం ముసుగు మనిషి అంటూ మీడియా రాసేది. అతడి ప్రాణాలకు అంత ముప్పు ఉందని ఉత్కంఠ పెంచారు. జూలై 10న ఇతడే ఒక మానవ కపాలం పట్టుకుని ధర్మస్థలలోనే బెల్తంగాడీ కోర్టుకు వచ్చాడు.
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్యమన్నట్టే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జూలై 19న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. ఆ కిరాయి మనిషి మాటల ఆధారంగా నేత్రావతి తీరంలో, ఆలయం సమీపం లోని అడవిలోని 13 ప్రదేశాలను ఎంపిక చేసి తవ్వకాలు మొదలు పెట్టారు. అక్కడే తాను శవాలను పాతి పెట్టానని అతడు అడ్డంగా అబద్ధమాడాడు. తానే కాకుండా దేవస్థానంలో పనిచేసే మరొక ఐదారుగురు కూడా ఈ పని చేశారని చెప్పాడు. ఆలయ సిబ్బందే తమకు శవాల సంగతి తెలియ చేసేవారని, తాము వాటిని తీసుకెళ్లి సమీపంలోని కొండలలో, అడవిలో పాతిపెట్టేవాళ్లమని వెల్లడిం చాడు. ఇంతకీ ఆరో నెంబర్ స్థలంలో ఒక మానవ కంకాళం కనిపించింది. తరువాత మరొక కంకాళం 11వ నెంబర్ స్థలంలో దొరికింది. ఇవి పురుషులవే కావడం విశేషం. ఆ దగాకోరు చెప్పినట్టు అవి యువతులవి కావు.
ఒక నెల పాటు సాగిన ఈ సుదీర్ఘ దగా తరువాత సిట్ కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మాటలను రుజువు చేసే సరైన ఆధారాలే లేవని నిర్ధారణకు వచ్చింది. కోర్టును కూడా మోసం చేసేందుకు అతడు ప్రయత్నించాడు. కోర్టుకు అతడు తెచ్చి చూపించిన అస్థికలన్నీ పురుషులవే. తరువాత నిస్సిగ్గుగా, నిష్పూచీగా, తాను చూపించిన ఏ ప్రదేశం లోను మానవ కంకాళాలు దొరకని మాట నిజమేనని, అందుకు కారణం, ప్రకృతిలో వచ్చే పరిణామంతో భూమి కొట్టుకుపోవడమేనని అతడు చెప్పడం విశేషం. యంత్రాలే ఈ విషయం గమనించలేక పోయాయి. ఇక మానవమాత్రుడినైన నేనెంత అని కూడా అన్నాడు. పెద్దల ఆదేశాల మేరకు 70 నుంచి 80 శవాలను పాతి పెట్టినట్టు ఆ ముసుగు మనిషి చూపిన స్థలంలో (13 నెంబర్ స్థలం) సిట్ గ్రౌండ్ పెనిట్రేషన్ రాడార్‌ను ఉపయోగించింది. అక్కడ 20 నుంచి 40 అడుగుల లోతుకు సిట్ తవ్వించింది. యంత్రం విఫలమైనదంటూ చెన్నయ్య వ్యాఖ్యా నించినది ఈ ఫలితాలతోనే. ఖననం చేసిన స్త్రీలు మొదట లైంగిక అత్యాచారానికి గురయ్యారని, హింసించి చంపారని ఎలా గమనించావని సిట్ బృందం ప్రశ్నిస్తే, తాను గుర్తించలేదని, ఆ మృతదేహాలను చూస్తే తనకు అలా అనిపించిందని చెప్పాడు. అలాంటివి ఉంటే డాక్టర్లు మాత్రమే చెప్పగలరని, తాను చెప్పలేనని కూడా అన్నాడు.
తాను ఖననం చేసిన శవాలలో 13 ఏళ్ల బాలికది కూడా ఉందని అతడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ శవాన్ని ఖననం చేసిన స్థలం వద్ద తవ్వినా అందుకు సంబంధించి ఏవీ ఆ ప్రదేశంలో దొరక లేదు. ఇంతకీ ఇంతకాలం తరువాత ఈ శవాల సామూహిక ఖననం అతడికి ఎందుకు గుర్తుకు వచ్చింది? చేసిన పాపాలకు పరిహారం చెల్లించుకోవ డానికే తాను తిరిగి వచ్చానని, ఎలాంటి లాంఛనాలు లేకుండా అంత్యక్రియలు జరిగిన వీరికి ఏదో మంచి చేయడమే తన ఉద్దేశమని అతడు చెప్పాడు. ఈ చావుల గురించి అప్పుడు మీడియాలో రాకపోవడం, ఎవరికీ తెలియకపోవడం వల్ల దగ్గరివారు ఎవరూ రాలేదని కూడా చెప్పాడు. సిట్ బృందం, దాని నాయకుడు ప్రణబ్ మహంతి అతడిని విచారించారు. చెన్నయ్య కోర్టులో చెప్పిన దానిని సిట్ బృందం నమ్మలేకపోయింది. ఇప్పటిదాకా చేసిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడు చెప్పిందంతా అబద్ధమని నిర్ధారించారు. ఇవి ఎలాంటి అబద్ధాలంటే, పోలీసులైనా తట్టుకోవడం కష్టమే. అందుకే ఇతడిని ఆగస్ట్ 23న అరెస్టు చేశారు.
ఇతడు కోర్టులోను, పోలీసుల దగ్గర ఒక పథకం మేరకు శిక్షణతోనే సమాచారం వెల్లడించినట్టు అర్ధమవుతుంది.‘చాలామంది మహిళల మృతదేహాల మీద దుస్తులు లేదా లోదుస్తులు లేవు. కొందరి మృతదేహాల మీద హింస, లైంగిక అత్యాచారాలకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. గొంతు నులిమి చంపినట్టుగా గాయాలు ఉన్నాయి. కొందరు విద్యార్థినులు సహా వందమందికి పైగా లైంగిక అత్యాచారాలకు గురయ్యారు. తరువాత చంపి పాతి పెట్టారు.’ జూన్ 3, 4 తేదీలలో చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఇవి. కొన్ని మానవ కంకాళాల ఫోటోలు సహా ఈ ఫిర్యాదు ఇచ్చాడతడు. తరువాత పోలీసు బందోబస్తు మధ్య బెల్తంగడి కోర్టుకు హాజరయ్యాడు. కళ్ల మీద పారదర్శకంగా ఉండే గుడ్డ మినహా, మిగిలిన శరీరమంతా కప్పుకుని అతడు కోర్టుకు వచ్చాడు. ఆ మృతులలో వందమందిని తన చేత బలవంతంగా పాతి పెట్టించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాన్ని న్యాయ మూర్తి ఎదుట చెప్పడానికి అతడిని తీసుకువచ్చారు. ఆ దురాగతాలు, లేదా లైంగిక అత్యాచారాలన్నీ 1998-2014 మధ్య జరిగాయని అతడు చెప్పాడు. ఎంత విషాదమంటే, ఆ రోజున వర్షంలోను కొందరు కోర్టు వద్ద ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు. ధర్మస్థలలో చనిపోయినట్టు చెబుతున్న తమ కుటుంబ సభ్యుల అవశేషాలను ఇవ్వాలని వారంతా కోరారు.
ఇంతకీ, రాజు (వైద్యనాథపుర), చెన్నయ్య ధర్మస్థల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికులగా పదేళ్ల క్రితం కలసి పనిచేశారు. ఒక పుణ్యక్షేత్రాన్ని, దానిని నిర్వహిస్తున్న వారిని అపఖ్యాతి పాలు చేయడానికి ఇంత దారుణానికి ఒడిగట్టడం దారుణమని రాజు చెప్పాడు. ఇతడిని కూడా సిట్ అరగంట పాటు విచారించింది. మంజునాథ ఆలయానికి సమీపంలో నదీతీరంలో బాహుబలి బెట్టా రేవు వద్ద తామిద్దరం విధులు నిర్వహించేవారమని, మేం ఇరుగు పొరుగు కూడానని, దేవస్థానం వారు మంచి జీతం, మంచి భోజనం కూడా ఇచ్చేవారని సిట్ ఎదుట చెప్పాడు రాజు. కొన్ని కుళ్లిన శవాలను చూశామని, చెట్లకు ఉరి వేసుకుని మరణించినవారిని కిందికి దించామే తప్ప వాటిని ఎప్పుడూ తాము పూడ్చి పెట్టలేదని రాజు చెప్పాడు. ఆ శవాలను అంబులెన్స్ లలో తీసుకుపోయేవారని తెలియచేశాడు. ఎవరివో శవాలు తీసుకెళ్లి ఖననం చేయమని తమను ఎవరూ ఏనాడూ ఆదేశించలేదని, తాము ఖననం చేసినవన్నీ పోలీసుల సమక్షంలోనేనని కూడా చెప్పాడు. మరి పోలీసులు ప్రదర్శించిన ఈ అత్యుత్సాహానికి అర్ధం ఏమిటి?





