ArticlesNews

శంకర నుంచి శారద వరకు: కాలడి నుంచి కశ్మీర్‌ ‌యాత్ర

333views

కేరళలో చిక్కని ఆకుపచ్చని రంగును పులుముకున్న ఉప్పు కయ్యల నుంచి మంచును ఒంటినిండా కప్పుకొని నిగూఢంగా, నిటారుగా నిలబడి ఉన్న కశ్మీర్‌ ‌పర్వత శిఖరాల వరకు నేను చేసిన యాత్ర కేవలం నా దేహంతో చేసినదికాదు. అది సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి, ఆది శంకరాచార్యుని అద్వైత వేదాంత తత్త్వాన్ని యావత్‌ ‌భారతావనికి తెలియజేయడానికి మేధోపరమైన, ఆధ్యాత్మికమైన ఆలోచనలతో సాగించిన ఓ దిగ్విజయ యాత్ర జతిన్‌ ‌లాల్‌ ‌యాత్రానుభవం.

ఆది శంకరాచార్యుడు జన్మించిన పవిత్ర కాలడి పట్టణంపై భానుడు తన తొలి లేలేత కిరణాలతో వెలుగులు వెదజల్లుతున్న సమయాన నా మోటారు సైకిల్‌ ‌పక్కన నిలబడి ఉన్నాను. మెరిసిపోతున్న ఆకాశాన్ని తాకుతున్నట్టుగా త్రివర్ణపతాకం రెపరెప లాడుతున్నది. విస్తారమైన ఆధ్యాత్మిక మహత్తును సంతరించుకున్న కాలడి నిత్యమూ స్ఫూర్తిని ఇచ్చే ఒక మూలాధారంగా తన సర్వస్వాన్ని ప్రకటించు కుంటున్నది. అయితే ఆ రోజున ఆ పవిత్రమైన పట్టణం భూమిపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటు న్నది. ఆదిగురువు ఆవిర్భవించిన ఆ నేల భౌగోళిక సరిహద్దులను చెరిపేసి, భావజాలపు అడ్డుగోడలను నేలకూల్చే యాత్రకు నాంది పలికే చిరస్మరణీయమైన విశేష స్థలంగా మారింది. నా పేరు జతిన్‌ ‌లాల్‌. ‌యాత్ర కోర్‌ ‌కమిటీ సభ్యుడ్ని. చలో ఎల్‌వోసీ (నియంత్రణ రేఖ) మూవ్‌మెంట్‌గా పేరొందిన ఒక చరిత్రాత్మకమైన మిషన్‌లో భాగమైనందుకు గర్విస్తున్నాను. ఇది దక్షిణ భారతదేశపు హృదయం నుంచి ఉత్తర భారతదేశపు సమున్నత శిఖరాల దాకా సాగించే ఒక యాత్ర. ఇది దేహంతో ఎంతో దూరం చేసే ప్రయాణం మాత్రమే కాదు. ఇది నాలో నిద్రాణావస్థను మేలుకొలిపే యాత్ర. మేం ఆయుధాలతో గొడవకు దిగడంలేదు. బదులుగా మా హృదయాల్లో రగులుతున్న ఆధ్యాత్మిక జ్వాలతో సరిహద్దులకు పయనమయ్యాం. భారతీయ పురాతన జ్ఞానపీఠమైన శారదా పీఠాన్ని తిరిగి మనది చేసుకోవా లనే ఆశను మా భుజాలపైకి ఎత్తుకున్నాం. ఆ మహోన్నతమైన పీఠం భౌగోళికంగా ఏర్పడిన హద్దులతో దశాబ్దాల క్రితమే భారతీయ గడ్డకు దూరమైపోయింది. మాజీ సైనిక అధికారి, ఆధ్యాత్మిక గురువు, నిజమైన దేశభక్తుడు కెప్టెన్‌ ‌రామానంద్‌ ‌చలో ఎల్‌వోసీ బృందం చేపట్టిన ఈ చరిత్రాత్మక ఉద్యమం వెనుక చోదకశక్తిగా నిలిచారు. దేశభక్తి, ఆధ్యాత్మిక స్ఫూర్తి మిళితమైన ఈ యాత్రకు ఒక ఉత్ప్రేరకంగా పనిచేశారు. యావత్‌ ‌దేశం పెనువిషాదంతో విలవిలాడిపోతున్న వేళ ఆయన సంప్రదాయ ఆందోళన కార్యక్రమాలను, ప్రదర్శనలను చేపట్టలేదు. ధర్మాన్ని మూలాధారంగా చేసుకొని చర్యకు ఉపక్రమించారు. ‘‘చలో ఎల్‌వోసీ’’ అనే భావన ఒక కమిటీ గదిలోనో ఒక ఎయిర్‌ ‌కండిషన్డ్ ‌కార్యాలయం లోనో పురుడుపోసుకున్నది కాదు. పెహల్గావ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత సగటు భారతీయుడి అంతరాంతరాల నుంచి ఉబికివచ్చిన వ్యధ, బాధ ఫేస్‌బుక్‌లో రాసుకున్న ఒక పోస్టులా మారింది. చలో ఎల్‌వోసీ ఆ పోస్టు నుంచి పుట్టుకొచ్చిందే. కాలడి నుంచి ఎల్‌వోసి దాకా వేల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి మోటార్‌ ‌సైకిళ్ల యాత్ర మొదలైంది. అది శస్త్రాలకు బదులుగా సంకల్పాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు సాగింది.

యాత్రకు అంతరాత్మ పిలుపు
యాత్రలో నేను పాల్గొనడమనేది ముందుగా అనుకున్నది కాదు ఎవరో ఒత్తిడి చేస్తే జరిగింది కాదు. అలా చేయాలని నా అంతరాత్మ నాకు చెప్పింది. ఆదిశంకరాచార్యుల బోధనలు, స్వామి వివేకానంద విప్లవాత్మక దృక్కోణం, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌జీ జాతీయవాద స్ఫూర్తి భారత్‌ ‌పట్ల నన్ను నిత్యం కర్తవ్యోన్ముఖున్ని చేస్తున్నాయి. సాధువులు, యోధులు, తపస్సంపన్నుల గాథలు వింటూ పెరిగిన నేను నాకున్న పరిధిలో వారి అడుగుజాడల్లో నడవాలని తహతహలాడుతుండే వాడిని. చలో ఎల్‌వోసీ ఉద్యమం నా కలను నిజం చేయడంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది.

శారదా పీఠం: సరిహద్దు వెంబడి భారతీయ ఆత్మ
ఈ యాత్ర నిజమైన పరమార్థం తెలుసుకోవా లంటే శారదా పీఠం ప్రాముఖ్యతను అవగతం చేసుకోవడం చాలా ముఖ్యం. శారదా పీఠం ఒకప్పుడు నలంద, తక్షశిలతో పాటుగా భారతీయ పురాతన విద్యకు కీలకమైన విద్యాసంస్థగా ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌-‌పీవోకేలో ఉంది. వేద విద్యకు, సంస్కృత సాహిత్యానికి, ఆధ్యాత్మిక సాధనలకు విద్యాలయంగా విలసిల్లింది. సాక్షాత్తూ ఆది శంకరాచార్యుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా ఈ పీఠాన్ని సందర్శించారు. శారదా పీఠం భారతీయ యాత్రికులకు దూరంగా, విదేశీయుల నియంత్రణలో తన ప్రాభావాన్ని కోల్పోతూ మౌన విద్యాలయంగా మిగిలిపోయింది. అయితే మన వరకు వచ్చేసరికి శారదా పీఠం భారతదేశపు ఆధ్మాత్మిక వారసత్వానికి సంకేతంగా ఉంది. కెప్టెన్‌ ‌రామానంద్‌కు, ఆయనతో చేరిన వారికి శారదా పీఠం భారతీయ మేధస్సుకు ప్రతిరూపంగా కనిపిస్తోంది. శారదా పీఠానికి ఆత్మ కైలాసమైతే కీలకమైన శక్తిగా కాశీ ఉంది. చలో ఎల్‌వోసీ ఉద్యమం ఆదిశంకరాచార్యుడు జన్మించిన కాలడి నుంచి ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందింది. యాత్రను ఇక్కడ నుంచి మొదలుపెట్టాలని తీసుకున్న నిర్ణయం ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు. ఆధ్యాత్మిక సారాన్ని పంచడం కోసమని ఆదిశంకరాచార్య కాలడి నుంచే భారతదేశ యాత్ర చేపట్టారు. చలో ఎల్‌వోసీ యాత్రను అన్ని విధాలు గానూ చూసినప్పుడు అప్పటి సనాతన సంకల్పానికి ఒక కొనసాగింపుగా మారింది.

యాత్ర మొదలుపెట్టడానికి ముందు కాలడిలో మహనీయులైన ఆచార్యులు, వేదపండితుల ఆశీస్సు లను తీసుకున్నాము. యాత్రలో మేం కూడా తీసుకొని వెళ్లిన త్రివర్ణపతాకం ఒక పతాకంగా మాత్రమే కాకుండా నిజరూపం దాల్చిన భరతమాతను ప్రతిబింబించింది. నా తలకు కాషాయ వస్త్రాన్ని ధరించాను. త్రివర్ణపతాకానికి శిరసు వంచి నమస్కరించాను. మోటార్‌ ‌సైకిల్‌ను అధిరోహించాను. ఇంజిన్‌ ఆన్‌ ‌చేశాను. నాతో పాటుగా యాత్రలో సాధువులు, విద్యార్థులు, మీడియా నిపుణులు, మోటార్‌ ‌సైకిల్‌ ఔత్సాహికులు, వైద్య నిపుణులు, పదవీవిరమణ చేసిన సైనికులు, ఒక్కసారి కూడా సొంత ఊరు దాటని యువతీయువకులు ఉన్నారు.

మోటారుసైకిళ్లు ముందుకు సాగుతుండగా మాలో ఒక సమష్టి స్ఫూర్తి ఊపిరి పోసుకుంది. కాలడిలో ఇరుకైన వీధులు ‘భారత్‌ ‌మాతా కీ జై’, ‘జై శారదా పీఠ్‌’ ‌నినాదాలతో ప్రతిధ్వనించాయి. వృద్ధులైన మాతృమూర్తులు ఆనందబాష్ఫాలతో మమ్మల్ని ఆశీర్వదించారు. పిల్లలు మా వాహనాలతో పాటుగా పరుగులు తీశారు. మాకు ముక్కూ ముఖం తెలియనివారు సైతం జాతీయ పతాకాన్ని రెపరెప లాడించడం ద్వారా మా యాత్రకు ఊతమిచ్చారు. మొత్తమ్మీద అది ఒక ఆరంభానికి ఎక్కువగానూ, ఒక పవిత్రమైన ఊరేగింపు నకు తక్కువగాను మారిపోయింది.

దారి పొడుగునా సమస్యలను మరపించిన సౌభ్రాతృత్వం
కాలడి నుంచి కశ్మీర్‌ ‌దాకా సాగిన యాత్రా మార్గం కఠినమైన సవాళ్లతో నిండినది. ఎనిమిది రాష్ట్రాల గుండా 3,500 కి.మీ.లకు పైగా సాగిన మా యాత్రలో విపత్కరమైన వాతావరణ పరిస్థితు లను, మెకానికల్‌ ‌సమస్యలను, భౌతికంగా నిస్సత్తువ లాంటి వాటిని మేం ఎదుర్కొన్నాం. మా యాత్ర వెనుక ఉద్దేశాన్ని తెలుసుకోవడంలో విఫలమైన వారు మమ్మల్ని నిరసిస్తున్నట్టుగా చూసేవారు. అలాగని మా పట్ల ఆత్మీయానురాగాలను పంచిన వారికి కొదవ లేదు. తమిళనాడులో ఒక కుటుంబం మేం సేదతీరడా నికి సాయపడింది. ఆ కుటుంబ సభ్యులు మాకు ప్రసాదాన్ని, టీని ఇచ్చారు. మహారాష్ట్రలో ఒక మెకానిక్‌ ‌మా మోటార్‌ ‌సైకిల్‌కు మరమ్మతు చేసినందుకు డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. అదేమంటే ‘‘భారతమాత కోసం యాత్ర చేపట్టిన మీ నుంచి నేను డబ్బులు తీసుకోను’’ అని అన్నాడు. మధ్యప్రదేశ్‌లో బడి పిల్లలు మాకు ఆతిథ్యమిచ్చారు. స్వేచ్ఛకు సంబంధించిన గీతాలను ఆలపించారు. ఢిల్లీలో మాజీ సైనికులు, జాతీయవాద నేతలు మమ్మల్ని గౌరవించారు. మరీ ముఖ్యంగా కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌ ‌నుంచి మాకు లభించిన మద్దతు మాటలకు అందనిది. మా యాత్ర ఉద్దేశాన్ని గుర్తించారు. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు.

మా యాత్ర సాగే మార్గంలోని కీలకమైన ప్రాంతాల్లో సంస్థాగతమైన, భావోద్వేగపూరితమైన మద్దతును మేం పొందడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవకుల సేవానిరతిని ప్రధానంగా ప్రస్తావించాలి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా మా యాత్ర సాగుతున్న మార్గలో ఆహారం, పెట్రోల్‌, ‌ప్రథమ చికిత్సకు సంబంధించినవాటితో సిద్ధంగా నిలబడి ఉండేవారు. సేవయే ధర్మం అనే భావనకు నిదర్శనంగా నిలిచారు. కంటికి కనిపించని వారి ఆపన్నహస్తాలు మా ఉద్యమం ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎక్కడా ఆగకుండా సాగిపోవడంలో ఆదుకున్నాయి. మా యాత్రలో ప్రతీ మజిలీలోనూ మేం చిన్నపాటి కార్యక్రమాలను నిర్వహించాం. వాటిలో సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు, ఆధ్మాత్మిక ప్రవచనాలు, అవగాహన సదస్సులు ఉన్నాయి. చాలా మందికి శారదాపీఠం గురించి తెలియనప్పటికీ భారత్‌లో విస్మరణకు గురైన దేవాలయాలు, జ్ఞాన చౌర్యం, బీటలు పడిపోయిన ఐక్యత గురించి మేం మాట్లాడినప్పుడు వారంతా ఎంతో ఆసక్తిగా విన్నారు. మేం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకుంటే ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మా యాత్రను చేపట్టలేదు. భారత్‌ ‌కోసం, భారత్‌ ‌స్మృతుల కోసం, భారత్‌ ‌భవిష్యత్తు కోసమే మా ఈ ఉద్యమానికి నాంది పలికాము. త్రివర్ణ పతాకాన్ని చేబూని శ్రీనగర్‌లోకి ప్రవేశించిన మా యాత్రా బృందానికి భద్రతా సిబ్బంది, పౌరులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ఇతరులు మావైపు ఆసక్తిగా చూశారు. నియంత్రణ రేఖకు దగ్గర్లోని ఒక సమున్నత స్థానం వద్ద జాతీయ పతాకాన్ని ఎగుర వేశాము. అమరులైన జవాన్ల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించాం. కంటికి కనిపించని అడ్డంకి ఏదో దూరం చేసినట్టుగా శారదా పీఠాన్ని స్మరించు కుంటూ ప్రార్థనలు చేశాము. మహర్షులు, సాధువులు, వేద పండితులు అడుగిడిన అక్కడి సమున్నత శిఖరాలను చూసి ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాను. వారు రచించిన కావ్యాలు, ఇతిహాసాలు, ఆధ్మాతిక గ్రంథాలు శిఖరాల అంచున చేరి ప్రపంచా నికి జ్ఞానాన్ని పంచుతున్నట్టుగా నాకు తోచింది. ఐక్యత, విముక్తి కోసమని వారు చేస్తున్న మంత్రో చ్చారణతో పర్వత శ్రేణులు ప్రతిధ్వనించిపోయాయి. అక్కడ వీస్తున్న గాలి భక్తి భావనను మోసుకొచ్చింది. చరిత్ర తాలూకు ప్రతిధ్వనులతో భూమి కంపించింది. సరిగ్గా ఆ క్షణంలో శారదా పీఠం నా ముంగిట సాక్షాత్కారించిన భావనతో నన్ను నేను మరిచి పోయాను. ఒక మోటార్‌ ‌సైకిల్‌ ‌రైడర్‌గా యాత్రను ప్రారంభించిన నేను భారత్‌ ఆధ్యాత్మిక వెన్నెముకను పునరుద్ధరించడానికి, విస్మరించిన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేసేందుకు, సనాతన ధర్మం దిశగా యువతకు స్ఫూర్తిని ఇవ్వడానికి ఉద్దేశించిన ఒక మహత్తరమైన కార్యక్రమానికి ప్రతినిధిగా తిరిగి వచ్చాను. శారదాపీఠం ప్రస్తుతానికి మనం దృష్టికి అందనంత దూరంలో ఉండిపోయినప్పటికీ చదువుల తల్లి శారదామాత ప్రసాదించిన జ్ఞానం, సమైక్యతాశ క్తి, భరతమాత స్ఫూర్తి వేలాదిగా హృదయాలను మేల్కొలిపింది.

మనం ఒక పీఠాన్ని మనదిగా చేసుకోకపోయి నప్పటికీ ఒక లోతైన సత్యాన్ని పునరుద్ధరించాము.

మనం ఒక పోరాటం చేయడానికి బదులుగా ఉదాసీనతను ప్రతిఘటించాము. చలో ఎల్‌వోసీ ఉద్యమం ఇక్కడితో ముగిసిపోలేదు సరికదా అది ఒక బాధ్యతాయుతమైన నాగరిక ప్రపంచంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. నేను కాలడిలో సారవంతమైన నేల నుంచి కశ్మీర్‌ ‌పవనాల దాకా భరతమాత సారాన్ని నా హృదయంలో మోసు కొని వెళ్లాను. బదులుగా ఆమె నాకు దారిపొడుగునా అడుగడుగునా మార్గదర్శనం చేసింది.

జై హింద్‌. ‌జై శారదాపీఠం. భారత్‌మాతా కీ జై.

-‘ఆర్గనైజర్‌’ ‌నుంచి