News

విజయవాడలో జగన్నాథ రథయాత్ర

211views

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇస్కాన్‌ ఆధ్వర్యాన శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. విద్యాధరపురంలోని లేబర్‌కాలనీ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన రథయాత్ర స్వాతి థియేటర్‌ రోడ్‌, జాతీయ రహదారి మీదుగా బ్యాంక్‌ సెంటర్‌, కుమ్మరిపాలెం సెంటర్‌, రథం సెంటర్‌కు చేరుకుంది. అక్కడ నుంచి సీతమ్మవారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచ మందిరం వద్దకు చేరుకుంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర రథయాత్ర జరిగింది. వేలాది మంది భక్తుల నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వేంచేసి ఉన్న రథం పురవీధుల్లో కొనసాగింది. రథయాత్ర కొనసాగినంత మేర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు చీపుళ్లతో వీధులను శుభ్రం చేస్తూ పూలు చల్లారు. రథంపై ఇస్కాన్‌ అధ్యక్షుడు చక్రధారి దాస్‌, లైలా గ్రూప్‌ సీఈఓ గోకరాజు గంగరాజు ఆశీనులయ్యారు. తొలుత పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వామివారికి మొదటి హారతి ఇచ్చి రథం ముందు బంగారు చీపురుతో ఊడ్చారు. ముఖ్యఅతిథులుగా ఇస్కాన్‌ జీబీసీ శ్రీమాన్‌ రేవతి రమణ్‌ ప్రభుజీ, పారిశ్రామికవేత్త తొండెపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.