
కన్వర్ యాత్రకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడుకోవడంతో పాటు భక్తుల మనోభావాలను గౌరవించడం అవసరమని నొక్కి చెప్పారు. యాత్ర మార్గంలో బహిరంగంగా మాంసం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గత సంవత్సరం తప్పనిసరి చేసినట్లుగా దుకాణదారులు తమ షాప్స్ వద్ద వారి పేర్లను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. కన్వర్ యాత్రలో ఊరేగింపు సమయంలో ఎటువంటి అంతరాయాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే, ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.. సామాజిక వ్యతిరేక శక్తులు మారువేషంలో చేరే అవకాశం ఉందని సీఎం యోగి హెచ్చరించారు.
అయితే, సీఎం యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాలకు మంత్రి జైవీర్ సింగ్ మద్దతు తెలిపారు. కన్వర్ యాత్ర ఒక హిందూ మతపరమైన తీర్థయాత్ర.. ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో దుకాణాలపై పేర్లు రాయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు అన్నారు. ఈ యాత్ర మతపరమైన భావాలతో ముడిపడి ఉంది.. మాంసం దుకాణాలు మూసి వేయబడాలి అని సూచించారు.





