
తాను, తన కుటుంబం, సమాజం ఏది చేసినా సరే అది దేశం కోసం చేస్తున్నానన్న భావన వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఇలాంటి జీవనం భారతీయులందరిదీ కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే అందరూ సుఖ సంతోషాలతో వుంటారన్నారు. కబీర్ ధామ్ లోని సత్సంగ్ లో భారతీయ సంస్కృతి, కర్తవ్యబోధ, ఆత్మశుద్ధి, విశ్వశుద్ధి అనే అంశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ దేశంలో భాషలు, సమస్యలు, జీవితాలు… ఇలా ప్రతీదీ భిన్నంగానే వుంటుందని.. కానీ.. మనమంతా ఒక్కటేనని పునరుద్ఘాటించారు. మనందరికీ ఓ తల్లి వుందని, ఆమె పేరు భారత మాత అని పేర్కొన్నారు. ఆమెను ముందుంచి నడవడం అందరి కర్తవ్యమని ఉద్బోధించారు.
మన దేశంలోని మహా పురుషులందరూ ధర్మాన్ని రక్షించారని, ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. భౌతిక ఆనందాలను అనుభవించిన తర్వాత కూడా… శోధించడాన్ని ఆపని సంస్కృతి మనదని, అది ఈనాటికీ కొనసాగుతోందని తెలిపారు. మనస్సును పవిత్రంగా వుంచుకుంటే దేవుడే మన దగ్గరికి వస్తాడని తెలిపారు.
కుటుంబ వ్యవస్థ కారణంగానే సామాజిక వ్యవస్థ కూడా నడుస్తోందని తెలిపారు. ప్రతి కుటుంబం కూడా కొంతలో కొంత ఏదో చేస్తూనే వుంటుందని, ఆ కర్తవ్యంతోనే ముందుకు సాగాలన్నారు. అలాగే దేశం కోసం కూడా ఏదో ఒకటి చేయాలన్న కర్తవ్యంతో కూడా ముందుకు సాగాలన్నారు.
మన దేశంలో ఎవ్వరికైనా ఇచ్చే గుణం వుంటే వారిని అమ్మతో పోల్చే సంప్రదాయం మన దేశంలో వుందని, అందుకే నదీమ తల్లి అని, గోమాత అని పిలుచుకుంటామని, దీని ద్వారా కృతజ్ఞతా భావన వెల్లివిరిస్తుందని తెలిపారు. ఆ భావనతోనే ఏ పనినైనా చేయగలమని, ఇతరులకు ఏదైనా ఇచ్చే భావన పెరుగుతుందన్నారు. ఇలాంటి భావన ద్వారానే అమరత్వం సిద్థిస్తుందని తెలిపారు. అందరమూ మొదట స్వీయ శుద్ధి చేసుకొని, ప్రపంచ శుద్ధి వైపు వెళ్లాలని సూచించారు.
సైన్స్ కారణంగా వికాసం జరిగిన మాట వాస్తవమే కానీ… పర్యావరణం నాశనమైందన్నారు. దీనిపైనే అందరూ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన మాట వాస్తవమే కానీ… దేనినీ విధ్వంసం చేయలేదన్నారు. భారత్ వద్ద సకల విద్యలున్నాయన్న విషయం విదేశాలకు కూడా బాగా తెలుసని, అయితే.. ఆత్మ విద్య ద్వారా మాత్రమే స్వయం శుద్ధులం కాగలమని స్పష్టం చేశారు.
భక్త కబీర్ చెప్పిన దోహాలు కేవలం భక్తి గురించి మాత్రమే కాదని, సామాజిక స్పృహను కూడా కలిగిస్తున్నాయని మోహన్ భాగవత్ అన్నారు. నేటికీ అవి సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. వీటి స్పృహతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజంలో సామరస్యం, సంస్కృతిని వ్యాప్తి చేస్తోందన్నారు.
సృష్టి పుట్టినప్పటి నుంచి మనిషి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడని, నిజమైన ఆనందంలో ఇంద్రియ సుఖాలలో లేదని, ఆత్మానందంలోనే వుందని వివరించారు. ఎంతసేపూ భోగమయ జీవితమే కాదని, లోక కల్యాణం, సేవ, సామాజిక బాధ్యత లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.జ్ఞానం, విజ్ఞానం, ధర్మం మరియు ఆధ్యాత్మికత వంటి అంశాలను ప్రపంచానికి అందించే గుణ భారత్ లక్షణమని, ఇప్పుడు మరోసారి ప్రపంచానికి దాతృత్వ గుణం పంచే సమయం భారత్ కి ఆసన్నమైందన్నారు.
భారతీయ సంస్కృతిని తమ జీవితాల్లోనే ఆచరణాత్మకంగా చూపించే గొప్ప గుణం భారతీయ సాధువుల లక్షణమని, వారే సమాజానికి నిజమైన మార్గదర్శకులని కొనియాడారు. సమాజంలో అందర్నీ కలుపుకొని వెళ్లే అవసరం వుందని, మనం ఆరాధించే పద్ధతులు మనల్ని సత్యం వైపు నడిపించే విధంగా వుండాలని ఉద్బోధించారు.
మన మన అంతరంగాలు అత్యంత శుద్ధంగా వుండాలని, అందరి పట్లా భక్తి భావం వుండాలని, ఇదే ధర్మమని, ఉపాసన చేస్తూ ఇలాంటి పద్ధతిలోకి అందరూ రావాలన్నారు.





