News

‘7 సిస్టర్స్‌’పై యూనస్‌ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవే : భారత నేతల మండిపాటు

191views

నా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన తీవ్ర వివాదాస్పద. వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన తీరును మననేతలు ఖండిస్తున్నారు. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.

‘‘యూనస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. అవి పూర్తిగా ఖండించదగినవి. భారత వ్యూహాత్మక కారిడార్ చికెన్స్ నెక్‌ కారిడార్‌ (‘Chicken’s Neck’ corridor)తో ముడిపడి ఉన్న అంశాలు.. ఆయన వ్యాఖ్యలకు కారణం. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో ఇది ఉంటుంది. ‘7 సిస్టర్స్‌’గా పిలిచే 7 ఈశాన్య రాష్ట్రాల (అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర)ను భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్‌ కలుపుతోంది. దీనిచుట్టూ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌ విస్తరించి ఉన్నాయి. గతంలోనూ ప్రధాన భూభాగాన్ని, ఈశాన్య ప్రాంతాన్ని విడదీసేలా స్వదేశంలోనే వ్యతిరేక శక్తులు ప్రయత్నించాయి. అందుకే ఆ కారిడార్ అంతటా సమర్థవంతమైన రైల్వే, రోడ్డు నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయడం అత్యావశ్యకం. ఇంకా.. చికెన్స్ నెక్‌ను బైపాస్‌ చేసేలా రెండు భూభాగాలను అనుసంధానించే ప్రత్యామ్నాయ రహదారి మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే అందుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సంకల్పం, ఆవిష్కరణలతో ఆ దిశగా విజయం సాధించవచ్చు. ఇక యూనస్ చేసిన ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దు. అవి వారి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి’’ అని హిమంత దుయ్యబట్టారు.

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో కొంతభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లకు అతి దగ్గర్లో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్‌ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం ప్రాంతం తమదేనంటూ డ్రాగన్‌ వాదిస్తూ వస్తోంది. ఈ విషయమై 2017లో భారత్‌-చైనా ల మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది.