News

పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం

229views

వైయస్సార్ జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌ గా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. భారత జాతీయ కళా సంస్కతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్‌) జిల్లా చాఫ్టర్‌ కన్వీనర్‌ లయన్‌ కె.చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధ్యక్షతన ఇంటాక్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలపై జిల్లా సంస్కృతి గొప్పదనాన్ని తెలిపే విధంగా ఏడాదిలో నాలుగు రకాల ఉత్సవాలను జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో కడపోత్సవాలు, గండికోట ఉత్సవాలు, పురాతన వారసత్వ ఉత్సవాలు , గుడి సంబరాలు వంటివి ఉండాలని సూచించారు. జిల్లాలో ఉన్న టెంపుల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా టూరిజం సర్క్యూట్‌ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న జానపదాలు, సాహిత్యాలు, కళలు, ఫోక్‌ డాన్సులు వంటి వాటిపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ఇంటాక్‌ కన్వీనర్‌ చిన్నపరెడ్డి మాట్లాడుతూ గండికోట వరల్డ్‌ హెరిటేజ్‌ గా యునెస్కో గుర్తింపుకోసం కృషి చేస్తున్నామని.. ఇందుకు జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా పర్యాటక శాఖ ఇంచార్జీ అధికారి సురేష్‌ కుమార్‌, టూరిజం మేనేజర్‌ రామ్‌ కుమార్‌,ఇంటాక్‌ సభ్యులు పాల్గొన్నారు.