
ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 8న ప్రారంభం కానున్నాయి. సంప్రదాయ పూజా కార్యక్రమాల అనంతరం శనివారం రాత్రి అమ్మవారు మెట్టినింటి ఆలయ వెలుపలకొచ్చి గ్రామోత్సవానికి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి డోలాయాన ఉత్సవం అనంతరం ఆలయ ప్రవేశం చేస్తుంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. ఇప్పటికే ఆలయ వర్గాలు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవ నిర్వహణ కమిటీ ఛైర్మన్ పారుపూడి వెంకట ప్రసాద్, మాజీ ఛైర్మన్ సుబ్బారావు, ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ప్రథమ పసుపు కుంకుమ పోలీసు శాఖదే..: అమ్మవారు మెట్టినింటి నుంచి ఉత్సవ ఆలయానికి బయలుదేరే ముందు ప్రథమ పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు పోలీసు శాఖ సమర్పించడం సంప్రదాయం. అనంతరం అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరుతారు. అమ్మవారు బయలుదేరిన దగ్గర నుంచి ఆలయ ప్రవేశం వరకు భక్తులు గండదీపాల మొక్కులు తీర్చుకుంటారు.
ప్రభుత్వ శాఖల సమన్వయంతో..: ఆలయం ప్రైవేటు వర్గాల పరిధిలో ఉన్నందున ఉత్సవాలు పూర్తిగా ఆలయ వర్గాలే నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా నగర పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తాయి. పారిశుద్ధ్య, మంచినీరు వంటి అంశాల్ని నగర పంచాయతీ పర్యవేక్షిస్తుంది. ఇందుకు రూ.లక్ష కేటాయించారు. ఉయ్యూరు ఆర్డీవో బి.ఎస్.హేలా షారోన్ నేతృత్వంలో తహసీల్దారు సురేష్‌కుమార్, నగర పంచాయతీ కమిషనర్ పి.వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భారీగా పోలీసు బందోబస్తు: తిరునాళ్ల పదిహేను రోజులు, ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే భద్రతా చర్యల కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులతో పాటు ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 25 మంది మహిళా పోలీసు సిబ్బంది, 250 మంది పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉయ్యూరు పట్టణ సీఐ టీవీవీ రామారావు తెలిపారు.
18న సిడిబండి ఉత్సవం..: 11వ రోజున ఎంతో వైభవంగా జరిగే ‘సిడిబండి’ ఉత్సవం 18న జరగనుంది. ఆ రోజు సుమారు లక్షకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈ ఉత్సవంలో స్థానిక ఎస్సీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సిడిబండిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు.





