News

జూనియర్ డాక్టర్ల ఆమరణ దీక్ష.. వరుసగా రెండో రోజూ కొనసాగింపు

32views

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడికి నిరసనగా ఆరుగురు జూనియర్ డాక్టర్లు ప్రారంభించిన ఆమరణ దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు, పని ప్రదేశాల్లో వైద్యులకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అంతేగాక ఆస్పత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, పర్మినెంట్ మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నిరాహారదీక్ష నిరవధికంగా కొనసాగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు అనారోగ్యానికి గురైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కాగా, ఆగస్ట్ 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో తోటి వైద్యురాలిపై లైంగిక దాడి హత్య తర్వాత జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 42 రోజుల తర్వాత సెప్టెంబర్ 21న తమ ఆందోళనను ముగించి విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే అదే నెల 27న సాగూర్ దత్తా ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు నర్సులను కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు అక్టోబర్ 1న మళ్లీ సమ్మె ప్రారంభించారు. అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ దీక్షకు దిగారు.