ArticlesNews

సమరస వనాన ‘తులసి’

27views

( అక్టోబరు 5 – కల్లూరి తులసమ్మ జయంతి )

సమాజం, సామరస్యం.. ఈ రెండింటికీ తన జీవితాన్నే వేదిక చేసుకున్నారు తులసమ్మ. ఆమెకు ఆదర్శం చంద్రమౌళి. ఇంతకీ ఎవరీ ఇద్దరూ?

ఇంటి పేరు ఒకటే.. కల్లూరి. గురుశిష్య అనుబంధం. ఇరువురి స్వస్థలం గుంటూరు ప్రాంతం. కేవలం ఉపన్యాసాలను నమ్ముకున్నవారు కారు. పది మాటల కంటే ఒక చేత (పని) మిన్న అని భావించి ఆచరించినవారు.

వందేమాతరం, జైహింద్‌…. ఇవే ఉభయుల నినాదాలు, విధానాలు, లక్ష్యాలు. అంతరాలకు అతీతం కావాలి జనత. ఉత్తమ ఆశయాల సాధనకు ఉదాత్త మార్గాల్లో పయనించాలి. ‘ఐక్యత’ అనే మూడే జాతికి మంత్రాక్షరాలు!

ముందుగా కల్లూరి తులసమ్మ గురించి…

ఆమె కన్ను తెరిచింది 1910 డిసెంబరు 25న. కన్ను మూసింది 2001 అక్టోబరు 5వ తేదీన. అంటే తొమ్మిది దశాబ్దాలకు పైగా జీవితకాలం.

బడి చదువు మాత్రమే. సర్వసామాన్య రైతు కుటుంబికులు. బయట కంటే ఇంట్లో చదువుకున్నదే ఎక్కువ. ఆ రోజుల్లోనే స్వాతంత్య్ర ఉద్యమయోధ తత్వం.

‘రండీ యువతీ యువకులారా! రారండీ మునుముందర!

ఆ మహాత్ము మధురవాణి ఆత్మబలము నందించెను

నరనారీ సాహార్ద ఆనందగీతి వినిపించెను

జాతినేత సత్యాగ్రహ సమరభేరి మారుమోగెను

శాంతియుత స్వాతంత్య్ర ఉజ్వల స్ఫూర్తి కనిపించెను

భారతీయ భావి భాగ్య భాను దీప్తినైతి నేను

లలిత నవోషస్సువోలె విలసిల్లిన నవబాలను!’

అనేలా ఆమె కృషి కొనసాగింది. ఆమె 30 ఏట ‘వ్యక్తి సత్యాగ్రహ’ దీక్ష చేపట్టారు.బ్రిటిష్‌ ‌పోలీసులు నిర్బంధించి నేరుగా తమిళనాడు కారాగారానికి తరలించారు.ఏడాదిన్నర పైగా జైల్లోనే! అక్కడ శిక్ష అనుభవించిన ఐదుగురు మహిళాయోధుల్లో ఆమె ఒకరు. పట్టుదలలో తనకు స్ఫూర్తి చంద్రమౌళి ఎందుకంటే…. పలు పర్యాయాలు చెరసాలల పాలైనా, సంకల్పశక్తి చెక్కు చెదరలేదు కాబట్టి –

కడగొట్టు తమ్ముడని, గారాబు సోదరుడని

కనికరమ్మే లేని కఠిన మానసులార!

ఏ తప్ప చేశాడురా, మీ సొమ్ము ఏమి కాజేశాడురా!

అందకుండా మీరు ముందు పరుగెడుతుంటే

విడలేక తమ్ముడూ వెనకాల వస్తుంటే

ధుమధుమ లాడారుటే!

వడగాడ్పులో శోషవచ్చి నాలుక ఎండి

చెరువులో నీళ్లు తానుగా తాగెనని కన్నెర్ర చేశారుటే!

జట్టులో రానీక నెట్టివేశారంటూ

మరిగిపోయెను మనసు, తిరిగి పోయెను బుద్ధి

కరిగిపోతున్నాడురా! నానాడు తరిగిపోతున్నాడురా!

(నాటి స్థితినీ, గతినీ ‘తప్పులేని తమ్ముడు’ గేయకర్త వెల్లడించారు. ఇప్పటికీ అటువంటి వాతావరణమే కనిపిస్తుండటం నిజంగా దయనీయం.)

ఆనాడు తెలుగు ప్రాంతాల్లో దళిత యాత్రలయ్యాయి. ఆలయాల్లోకి వారి ప్రవేశాలు జరిగాయి. కార్యాచరణ దిశగా కల్లూరి చంద్రమౌళి నేతృత్వం వహించడాన్ని అప్పటి యువనేత్రి హర్షించి అనుసరించారు. ఆ యువ నాయకురాలు తులసమ్మే! దళితజన సముద్ధరణ, విదేశీ వస్త్రబహిష్కరణ, శాసన ఉల్లంఘన వంటి అన్నింటిలోనూ ముందు వరసన నిలిచారు.

ఆమె దినచర్య ప్రత్యేకంగా ఉండేది. రాట్నం వడికితే వచ్చే ప్రతిఫలంతో అన్నం, మజ్జిగ, పచ్చడి. అంతే, అంతవరకే.

సామాజిక ఐక్యతకు ఉపకరించే కార్యక్రమాలు ఎన్నెన్నో చేపట్టారు. గ్రామీణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. సేవా కార్యకలాపాల్లో చురుకుగా ఉంటూ సమరసతను ప్రత్యక్షం చేసేవారామె.

స్వతంత్ర ఉద్యమ కార్యకర్తగా ఆసాంతం క్రియాశీలత. కాలిపట్టాలు, వెండి మట్టెలు సహా తన మహోద్యమ నిర్వహణకు ఇచ్చేశారు. ఖద్దరు విస్తృతికీ పరిశ్రమించారు.

తన ఇంటిని ఖాదీ సంస్థకు ఇవ్వడంతో, అక్కడే నూలు, ఖద్దరు వస్త్రాలు తయారయ్యేవి. ఎంతోమంది వనితలకు ఉపాధి• కలుగుతుండేది. తులసమ్మ జీవితంలో మరో ప్రధాన స్థానం ‘సర్వోదయ’. దానినొక ఉద్యమంగా, నిత్య బాధ్యతగా నిర్వర్తించారు. సర్వోదయ అనేది అందరి పురోగతికీ సూచిక. మరో మాటలో సార్వత్రిక ఉద్ధరణ. దేశ సామాజిక, ఆర్థిక, ధార్మిక సంస్కృతిని పురోగమింప చేయడమే లక్ష్యం.

సహకారానికే ప్రాధాన్యం. అధికారానికి కాదు.

తమ్ముల నిద్రలేపి, చిరదాస్య తమస్తులు వాపి, వెలుగులన్‌

‌జిమ్ము పథమ్ము జూపి నిలసిల్లెడు దివ్య సువర్ణ సుప్రభా

తమ్మవు నీవు; నీ జయపతాకము నీడల నిలిచినారు భా

వమ్ముల జాతి వర్ణ మత వర్గ విభేదము మాని, ఎల్లరున్‌!

‌నీ తేజో మహిమంబు మా హృదయమందే కాదు, విశ్వ ప్రజా

చేతో వీధుల కాంతిరేఖలు వెలార్చెన్‌, ‌ఖండ ఖండాంతర

ఖ్యాతంబుల్‌ ‌భవదీయ పౌరుష యశోగాథల్‌ ‌లిఖింపంబడున్‌

‌స్వాతంత్య్రోజ్వల వీరభారత కృతిన్‌ ‌సౌవర్ణ వర్గాలతో!

అన్నట్లు సాగిందామె జీవనయానం. అది సర్వోదయ అన్వితం.

ఆ ఉద్యమమూ ప్రజలందరి సంక్షేమంవైపే చూపు సారించింది.

మనదైన భారతీయ సమాజంలోని అన్ని వర్గాలకూ అధికార నిర్ణయం ఉండాలంది. సమానతకే సమధిక ప్రాధాన్యమిచ్చింది.

శాంతి, శ్రేయస్సు, ఆనందం – ఈ మూడు ఆశయాలు. వీటి ప్రాథమికత ఆధారంగా కీలక అంశాలు మూడు.

మొదటిది: ఒకరికి మేలు మిగిలిన అందరికీ వీలు.

రెండోది: ఏ పనికి తగిన విలువ, గౌరవం ఆ పనికే.

మూడోది: శ్రమిస్తేనే జీవన సమున్నతి. అది నిత్య సత్యం.

ఈ అన్నింటి ప్రాతిపదికతోనే సర్వోదయం ముందుకు సాగింది. నవ్య సామాజికతకు మూలకారకంగా ఏర్పడింది.

ఉద్యమ దశకు చేర్చింది వినోబా భావే. క్షేత్రస్థాయిలో ఆచారణకు మనసా వాచా కర్మణా నడుంకట్టింది తులసమ్మ.

ఎక్కడ అభ్యున్నతి అయినా రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి భౌతికంగా, మరొకటి నైతిక రూపంగా. వీటినే ప్రముఖంగా బోధించిన తులసమ్మ సమాచరణలోనూ అగ్రేసరురాలు.

అందరి మంచికీ సంకల్పం. ఆ సంకల్ప శక్తియుక్తులనే క్రియా రూపానికి తెచ్చిన వనితామణి ఆమె.

సర్వోదయం అంటే సామాజికమే. ఆ ఉద్యమ భావాన్ని స్థాపిత సంస్థగా తెచ్చినవారు వినోబా. ఆయనతోపాటు ముగ్గురు సోదరులూ కఠోర సాధన చేశారు. నియబద్ధ జీవితం గడిపారు. సంఘంలోనే ఉండి, సాటివారి మేలుకు బాధ్యత వహించడమే ధ్యేయంగా నడిచారు.

ప్రత్యేకించి వినోబాజీ జీవితమంతా దీనజన ఉద్ధరణతోనే నిండి ఉంది. ఆయన ఆధ్యాత్మిక, నైతిక, తాత్విక భావనల ప్రభావం తులసమ్మపై ఎంతగానో ఉంటూ వచ్చింది.

వాణీ విలాస చతురా ప్రథితా ప్రసన్నా

భావే మహర్షి చరిత ప్రమితి ప్రపూర్ణా!

వాణీ మదీయ రసనోద్గతరమ్య వర్ణా

భూయాత్యమాజ పునరుద్ధరణ ప్రకీర్ణా

అని ఆచార్య స్తుతి అందించారు జోశ్యులవారు. ఆ పుస్తకం ప్రచురితమై ఇప్పటికి సరిగ్గా నాలుగు దశాబ్దాలు.

కలవారు, లేనివారు అంటుంటారు. కొందరికి ఐశ్వర్యం ఉంటుంది. ఇంకొంత మందిది పనిచేయగలిగిన శక్తి. అలా ప్రతీ వ్యక్తికీ ఏదో ఒకటి సొంతం. దాన్ని ఇంటి నాలుగు గోడలకే పరిమితం. చేసుకోకుండా, నలుగురికీ అందించాలన్నదే వినోబా ఉపదేశం. సేవ ఉండాల్సింది ఇంట్లో బందీగా కాదు. ఇంటి బయట సాధనంగా ఉండాలన్నది సారాంశం.

ఇటువంటి ఈ భావాలన్నీ తులసమ్మను ఆకట్టుకున్నాయి. ప్రచార పక్రియను తానే స్వీకరించారు. ఊరూరా ఇంటింటికీ కాలినడకన వెళ్లారు. సర్వోదయోద్యమ అంతరార్థాన్ని విశదపరిచారు అందరికీ. ఆమె అంతరంగంలో వినోబా అయినా, చంద్రమౌళి అయినా….

శాంతికి క్రాంతి నేరిపి, ప్రజా హృదయాబ్జములన్‌ ‌సువర్ణ సం

క్రాంతులు జాలువారిచి, జగత్తుకు వేడి వెలుంగొసంగు భా

స్వంతుడవు నీవు; తానక యశస్సులు భారతమాత మౌళిపై

దొంతర మల్లెలైనవి గదా…. ప్రఫుల్ల పరీమళమ్ముతో!

వీరితోపాటు ఆమె ఆత్మీయురాలు తుమ్మల దుర్గాంబ. గుంటూరు ప్రాంతం లోనే జాతి పునర్నిర్మాణ రూప చిత్రణగా ‘వినయాశ్రమం’ స్థాపకురాలు. ప్రజలం దరి సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదకారి. దుర్గాంబ దంపతులూ సమాజ సమరసతకు అంకితమైనవారే.

ఆ రోజుల్లో గాంధీజీ భారత స్వతంత్ర సమరంలో భాగంగా దళితయాత్ర నిర్వహించారు. గుంటూరు ప్రాంతంలో పర్యటిస్తూ వినయాశ్రమంలో కొన్నాళ్లు ఉన్నారు. దళితులతో ఆలయ ప్రవేశాలు చేయించారు. మరో పర్యాయం కూడా ఆయన వచ్చి వెళ్లారు.

1960 ప్రాంతంలో ఆశ్రమ రజత ఉత్సవాలు జరిగాయి. ఆ వేడుకలకు తొలి రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్‌ ‌ప్రధాన అతిథి.

స్వతంత్ర భారతావనిలో సైతం ఆశ్రమ ప్రత్యేకతలు ఇనుమడించాయి. ఇందులో కల్లూరి తులసమ్మదీ కీలక పాత్ర. ఆమె చరఖాను వినియోగించారు. స్వదేశీ వస్త్ర ప్రాధాన్యాన్ని అంతటా ప్రచారానికి తెచ్చారు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలను పొందలేరు. పింఛను సైతం స్వీకరించలేదామె.ఎవరి నుంచి ఎటువంటి సాయాన్ని అర్థించలేదు. అంతటి ఆత్మాభిమాని. దృఢదీక్షకు ఉదాహరణ.

ఆ సేవానిరతి కారణంగానే ఆమె స్వగ్రామం పెదరావూరుకు జాతీయ ప్రాముఖ్యం లభించింది. లభిస్తోంది ఇంకా.

నిరాడంబరంగా ఉండటం స్వయంశక్తితో జీవించడం అనే వాటిని ఆమెను చూసే నేర్చుకోవాలి ఎవరైనా!

ఊరు అనగానే రాజకీయాలు ఉంటాయి. ఆ గ్రామంలో ఉన్నవన్ని అభివృద్ధి దాయక పాలన పనులే! అభివృద్ధికి అక్కడ అర్థమంటూ గోచరిస్తుంది. ఆ ఊళ్లోని రామాలయానికి ఆధునికీకరణ పనులు జరిపారు.

శివాలయానికి జీర్ణోద్ధరణ పనులనేకం నిర్వహించారు. గ్రామవాసులు ఈనాటికీ కల్లూరి తులసమ్మనే గుర్తు చేసుకొంటూ ఉంటారు.

అందుకు కారణం ఆమె నియమబద్ధ జీవనం. అవిశ్రాంత సేవా స్వభావం. మనకు స్వాతంత్య్రం రావడానికి ముందు, అటు తర్వాత కూడా ఎప్పుడూ తాను కలవరించింది సమానత్వం, సామరస్యం గురించే! అందుకే ఆ జీవితం నిరంతర సమరసతకు వేదికగా భాసించింది. ముందే అన్నట్లు – ఆమెది ఆసాంత నియమశీలత.

-జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్