News

తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం

18views

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. కేంద్రం తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా, టీటీడీ తరపున సిద్ధార్థ్ లూథ్రా, వైవీ సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ తమ వాదనలు వినిపించారు.

అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేయాలని, దర్యాప్తు బృందంలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని, పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తరపున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. తిరుమల వేంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు.. లడ్డూకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల్లో వాస్తవం ఉంటే అది ఆమోదయోగ్యం కాదని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ, దర్యాప్తుపై భక్తుల్లో మరింత విశ్వాసం కలిగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షించాలని ఆయన కోర్టుకు ప్రతిపాదించారు.

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ముఖ్యమంత్రి ప్రకటన చేయకుంటే అది వేరే విషయం. నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రోహిత్గీ బదులిస్తూ.. ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ నెలలో చేసిన ప్రకటనకు, జూలైలో వెలువడిన ఈ కేసు నివేదికకు సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారని, మీడియా కేవలం నాలుగు లైన్లు మాత్రమే సందర్భానుసారంగా తీసుకుందని ఆయన కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.