News

సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం : పవన్ కల్యాణ్

27views

సనాతన ధర్మాన్ని ముట్టుకున్న ఎవరైనా మాడి మసైపోతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్‌ సభలో ఆయన మాట్లాడారు.

విగ్రహం తల నరికేశారు. కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాల్ని ఏడుకొండలవాడికి నైవేద్యంగా పెట్టారు. అదే కల్తీ నెయ్యితో చేసిన లక్ష లడ్డూల్ని అయోధ్య రాముడికి పంపించారు. ఆయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని రాహుల్‌గాంధీ ‘నాచ్‌ గానా’ సభగా ఎద్దేవా చేశారు. వాళ్లు సనాతన ధర్మాన్ని అవహేళన చేసినా మా మనోభావాలు దెబ్బతినకూడదు. హిందువులంతా ఓట్లేసి వాళ్లను గెలిపించాలి. కానీ వాళ్లు మాత్రం రాముణ్ని గౌరవించరు’ అని ఉపముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్మల్ని ద్వేషించండి.. కానీ రాముణ్ని విమర్శించే సాహసం చేయొద్దని హెచ్చరించారు. వైకాపా అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లపై ఆయన నిప్పులు చెరిగారు. తన మాటలు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అందరూ వినాలంటూ ఆయన.. తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భంలో తమిళంలోనూ మాట్లాడారు.

లౌకికవాదం వన్‌వే కాదు.. టు వే.
‘సనాతన ధర్మంపై దాడులు నిత్యకృత్యమైతే మేం నోరు మెదపకుండా, శాంతి వచనాలు ఎలా పలుకుతాం? ఒక అల్లా గురించో, మహ్మద్‌ ప్రవక్త గురించో తప్పుడు మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు. ప్రపంచమంతా గగ్గోలు పెట్టేస్తారు. కానీ మేం స్పందిస్తే మాత్రం మతోన్మాదులం అయిపోతాం. మా బాధ చెప్పుకోవడం పాపమా? లౌకికవాదం వన్‌వే కాదు.. టు వే. మాకు మర్యాదివ్వండి.. మర్యాద తీసుకోండి. అలా జరగనప్పుడు గొంతెత్తక తప్పదు’ అని ఆయన స్పష్టం చేశారు. ‘వేంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్‌ అంటూ కోట్ల మంది భక్తిశ్రద్ధలతో కొలుచుకునే ఏడుకొండలవాడికి ప్రసాదంలో అపచారం జరిగినందుకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే రాజకీయం చేయొద్దంటూ అవహేళన చేశారు. సనాతన ధర్మాన్ని పాటించడం పాపం అన్నట్టుగా కొందరు సూడో మేధావులు గగ్గోలు పెట్టారు. వైకాపా నాయకులు సనాతన ధర్మాన్ని ప్రతి రోజూ అవమానిస్తున్నా భరించాం. కానీ శ్రీవారికి కల్తీ నెయ్యితో ప్రసాదాలు పెడితే భరించలేం. అపచారం జరుగుతోందని, సరిదిద్దుకోమని గతంలో హెచ్చరించామని అన్నారు

కోర్టులూ వారినే రక్షిస్తున్నాయి!
‘ఈ దేశంలో చట్టాలు కూడా సనాతన ధర్మాన్ని పాటించేవారి విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్యధర్మాలు పాటించేవారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారికే కోర్టులు రక్షణ కల్పిస్తాయి. ఈ దేశంలో మెజార్టీ వర్గంగా ఉండటం బలహీనత కూడా కావొచ్చు’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

మనమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది!
18వ శతాబ్దంలో మెకాలే ప్రవేశపెట్టిన సాంస్కృతిక సామ్రాజ్యవాదం.. సనాతన ధర్మంపై దాడి చేసేవారిలో ఇంకా వేళ్లూనుకునే ఉందని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. అలాంటి కుహనా లౌకికవాదులకు ‘ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌.. గాడ్‌ సేవ్‌ ద కింగ్‌.. సో హెల్ప్‌ మీగాడ్‌’ అని రాసే పాశ్చాత్య అగ్ర రాజ్యాలు కనిపించవు, ఆసియా, ఆఫ్రికాల్లో ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్న దేశాలు కనిపించవు. బంగ్లాదేశ్‌ విముక్త పోరాటంలో 3,630 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా ప్రకటించుకున్నా, అక్కడి హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదని ఆంక్షలు విధించినా సూడో మేధావులకు కనిపించదు’ అని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడం, కులాలు, సాంస్కృతిక, ప్రాంతీయ భేదాలు, పిరికితనాన్ని మంచితనం అనుకోవడం, చేతగానితనానికి అసహనం అని పేరు పెట్టుకోవడం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు, కృష్ణుడు, కాళికాదేవి నల్లని మేని ఛాయ కలిగి ఉంటారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు. వాటన్నింటికీ అది అతీతం. మనం భయం, పిరికితనం వదిలేసి ఏకం కావాల్సిన సమయం వచ్చింది’ అని పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.