ArticlesNews

రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత

71views

వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నదనీ, ఐఎస్ఐఎస్ఐకి సభ్యులను నియమించుకునే పనిలో ఉన్నదనీ సాక్షాత్తు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, కన్నూర్లో విశేష రాజకీయ పలుకుబడి కలిగిన పి. జయరాజన్ కుండ బద్దలు కొట్టారు. అధికార పార్టీ సభ్యుడు చేసిన వ్యాఖ్య రాష్ట్రంలో దుమారం లేపుతున్నది. స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయరాజన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాజకీయ ఇస్లాం ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షిస్తున్నదని, అందుకే అది రాష్ట్రానికి పెద్ద బెడద అని అన్నారు. రాబోయే తన పుస్తకం గురించి కొన్ని మాటలు చెబుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రాజకీయాలకీ, రాజకీయ ఇస్లాంకీ చాలా తేడా ఉందని ఆయన సూత్రీకరించారు. ముస్లిం రాజకీయాలు మైనారిటీలను నడిపించేవనీ, రాజకీయ ఇస్లాం ప్రమాదకరమని ఆయన చెప్పారు. కేరళలో జమాత్ ఏ ఇస్లామి, పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు రాజకీయ ఇస్లాం అనే ప్రమాదకర సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయని ఆయన తేల్చి చెప్పారు (కానీ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధిస్తే దానికి ఆమోద ముద్ర వేయడానికి సీపీఎం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. పైగా విశ్వ హిందూ పరిషత్ను కూడా నిషేధించాలని ఒక వికృత వాదన తెచ్చింది). కన్నూర్ నుంచి కొంతమందిని ఐఎస్ఐఎస్ఐ చేర్చారని, వారు సిరియా, అఫ్ఘానిస్తాన్లకు వెళ్లారని జయరాజన్ ఆరోపించారు. కశ్మీర్ ఉగ్రవాదులతో చేరిన నలుగురు, సైన్యం జరిపిన ఎన్ కౌంటర్లో చనిపోయిన సంగతి కూడా వెల్లడించారు.

ఈ అంశాన్ని పెద్దదిగా చేసిన చూపించడం తన ఉద్దేశం కాదని, రాజకీయ ఇస్లాం ప్రభావం రాష్ట్ర యువత మీద ఉందన్నది నిజమని ఆయన అన్నారు. అయితే బాబ్రీ మసీదు పతనం తరువాత తలెత్తిన సామాజిక పరిణామాల నేపథ్యంలో ఇది జరిగిందని ఆయన ముక్తాయించారు. సీపీఎం నేత వ్యాఖ్య దక్షిణాది రాష్ట్రాలలోనే పెద్ద చర్చకు తావిచ్చింది. కొన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పాటు కొన్ని క్రైస్తవ సంస్థలు ఇదే విషయాన్ని బహిరంగంగా చెబుతూనే ఉన్నాయి. ఆఖరికి కేరళ స్టోరీ అనే చలనచిత్రం కూడా ఈ అంశాన్ని కొంతవరకు చర్చించింది కూడా. అయినా ఎవరూ అంగీకరించడానికి ముందుకు రాలేదు. కనీసం ఆ అంశాన్ని గుర్తించడం కూడా చాలామందికి ఇష్టం లేదు. నిజానికి జయరాజన్ కూడా కేరళ స్టోరీలో చూపించింది పాక్షిక సత్యాలు మాత్రమేనని కొట్టి
పారేసినప్పటికీ అందులో చూపించిన ఐఎస్ఐఎస్ లోకి యువకులను చేర్పించే సన్నివేశాలు మాత్రం సత్యమేనని అంగీకరించారు. యథాప్రకారం లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఈపీ జయరాజన్ మాత్రం తమ పార్టీ సీనియర్ నేత జయరాజన్ ప్రకటనను ఖండించారు. అసలు కేరళలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశమే లేదని ప్రగల్పించారు. రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రబలకుండా ప్రభుత్వం పరమ జాగరూ కతతో వ్యవహరిస్తున్నదని ఆయన చెప్పుకున్నారు.

అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం తీవ్రమైన అంశమని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. తనకు కూడా ఈ విషయం పూర్తిగా తెలియకపోయినా, ప్రముఖ నాయకుడు వెలువరించిన అభిప్రాయం మేరకు ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలని గవర్నర్ అన్నారు. సీపీఎం నేత ప్రకటనకు ఆధారం ఏమిటో చూసి, ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ జయరాజన్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని చెప్పారు. ఒకవేళ నిజంగానే కేరళ ఐఎస్ఐఎస్ నియామకాలకు కేంద్రంగా ఉంటే, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సతీశన్ అభిప్రాయపడ్డారు. కన్నూర్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సొంత ప్రాంతం కాబట్టి ఈ అంశాన్ని మరింత లోతుగా ఆలోచించాలని అన్నారాయన. జయరాజన్ వ్యాఖ్యను సీపీఎం సమర్థిస్తున్నదా లేదా అనే అంశాన్ని వెంటనే నిర్ధారించాలని సతీశన్ అన్నారు. కేథలిక్ చర్చ్ పత్రిక దీపిక జయరాజన్ ప్రకటనను స్వాగతించింది.