ArticlesNews

రామాయణ కాలం నాటి నీటి ప్రణాళికలు

34views

అమెరికాలోని పురావస్తు పరిశోధన సంస్థ ఈ మధ్య ఒక గ్రంథాన్ని ప్రచురించింది. అందులో శ్రీ.వి.బి. లాల్, కె.యన్.దీక్షిత్లు రాసిన ఓ వ్యాసం వేల సంవత్సరాల క్రితం భారత్ లో పరిణతి చెందిన జలశాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నది. ఉత్తరప్రదేశ్లోని శృంగవేరపురలో జరిపిన త్రవ్వకాల్లో కనుక్కున్న విశేషాలు మనం చాలా గర్వించదగ్గవి.

అక్కడి తవ్వకాల్లో ఓ పెద్ద చెరువు బయటపడ్డది. గంగనీటిని మళ్లించి ఈ చెరువును నింపే కాలువలు భద్రంగా ఉన్నవి. చెరువు చిన్నదేం గాదు, 750 అడుగుల పెద్దది.రామాయణంలో పేర్కొన్న ప్రఖ్యాత ప్రదేశాల్లో జరిపే తవ్వకాలలోని భాగం ఈ పరిశీలన. ఇదో పెద్ద ప్రణాళిక, ఈ ప్రణాళికను మన పవిత్ర గ్రంథా లైన రామాయణ, మహాభారతాలు అసలు నిజంగా జరిగినవా?కాదా? అన్న విషయం నిరూపించటానికి చేపట్టారు.

ఎటువంటి ఆధారం లేకుండానే ‘రామాయణం కేవలం కట్టుకథే!’ అనే మహాత్ములు, మేధావులు ఎంతోమంది ఉన్నారు. వాల్మీకి రామాయణం యావ ద్భారతంలో అన్ని మూలల వాళ్లూ, అన్ని భాషల వాళ్లు పరమ పవిత్రంగా చూస్తారు. హైందవ జీవన సరళిలో ఇది అంతర్భాగం. రామాయణంలో వివిధ పాత్రలు సజీవాలు, సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, అంజనేయుడు ఇలా ఎందరో. రామాయణమే కట్టుకథ అనే మేధావుల మాటల్లో జాతిని ఛిద్రంచేసే కుట్రమాత్రమే కనిపిస్తుంది.

ఈ మేధావులకు మరి ఇతర దేశాల గ్రంథాలు కట్టుకథలుగా కనిపించవు. విదేశీ మతాలు, వాళ్ల రచనలనే కల్పితాలనిగాని, కృత్రిమాలనిగాని అనరు. వీళ్లల్లో ఎక్కువమంది హిందువులే! విదేశీయుల నిగూఢ కుట్రలను అర్థం చేసుకోక వాళ్ల వ్యాఖ్యా నాలను చిలకల్లా మాత్రం వల్లిస్తుంటారు. మనం అనాగరికులం, శాస్త్రజ్ఞానం లేదు, ఆంగ్లేయులే అన్నీ నేర్పారని నమ్మేవాళ్లెందరో!!

ప్రస్తుతం కనుక్కున్న చెరువు కట్టడం జలశాస్త్ర విజ్ఞాన పరాకాష్టకు ఓ నమూనాగా చెప్పొచ్చు.

“అక్కడ లభించిన కుండలు, నాణాలు చెక్కిన ముద్రికలు, బొమ్మలు లాంటి వాటి ఆధారంతో ఈ చెరువును తవ్విన కాలనిర్ణయం జరిగింది. ఇక్కడి జలయంత్ర శాస్త్రం అనిర్వచనీయమైంది. పురాతన భారతీయ శాస్త్ర జ్ఞాన పరిపూర్ణతను తెలియ జేస్తుంది. దీనిని ప్రజలకు నీటి వసతిగానే కాకుండా ధార్మిక కార్యక్రమాలకు కూడా ఉపయోగించేవారని అక్కడ బయటపడ్డ దేవీ విగ్రహాలు తెలుపుతున్నది” అని రాశారు రచయితలు.

శృంగవేరపురను ప్రయాగకు 35 కిలోమీటర్లు నైరుతి దిక్కులో కనుక్కున్నారు. ఇక్కడ గంగానది గుర్రపునాడాలా వంపు తిరిగి ఉంటుంది. ఈ శృంగ వేరపుర క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల ప్రాంతంలోనిదని పరీక్షల వల్ల తేలింది. అంటే అప్పటికి క్రైస్తవంగాని, ఇస్లాంగాని పుట్టలేదు! మొదట నదీ తటాన మొదలై జనాభా పెరిగే కొద్ది దూరదూర భూభాగానికి వ్యాపించింది ఈ పట్టణం.

ఇలా సుదూర ప్రాంతానికి, నదికి దూరంగా పెరిగిన ఊరి ప్రజలకు నీరు సరఫరా చెయ్యటానికి ఉద్దేశించినదే ఈ చెరువు, కోసలదేశ రాజు ఒకరు దీనికి బాధ్యత వహించి తవ్వించారని తేలింది. ‘ఆ రాజు ఎవరు?’ అన్న విషయం నిర్ధారణగా చెప్పటానికి పరిశోధనలు జరుగుతున్నవి.

సాధారణ శకం పూర్వపు రోజులకు చెందిన చెరువులు భారత్ లో చాలానే ఉన్నాయి. మధుర ప్రాంతం ఇలాంటి చెరువులకు ప్రసిద్ధి చెందింది. కాని ఈ శృంగవేరపుర చెరువు చాలా భిన్నమైంది. ఇతర మధుర చెరువులతో పోలిస్తే దీనిలో ఎన్నో రెట్ల నీరు నిలువ చేశారు.

త్రవ్వకాలు ఇంకా జరుగుతూనే ఉన్నవి. అయినంతవరకే 750 అడుగుల పొడుగున చెరువు బయటపడ్డది. త్రవ్వకాలు పూర్తయ్యేసరికి ఇంకా చాలా బయటపడవచ్చని ఆశిస్తున్నారు శాస్త్రజ్ఞులు.