News

అనకాపల్లిలో ఉత్సాహంగా రైతు మేళా

29views

గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి… విక్రయించిన రైతు మేళాను అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్‌లో భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి సెప్టెంబరు 28న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎఫ్ పి ఓ / ఎఫ్ పీ సీ లు ఏర్పాటు చేసిన స్టాళ్ల‌లో రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకానికి పెట్టారు. పలువురు సందర్శకులు స్టాళ్ల‌ను సందర్శించి నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అనకాపల్లి పట్టణంలో రెండు రోజులు జరిగే ఈ రైతులు మేళాకు ప్రతి ఒక్కరు వచ్చి రైతులు ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని కుమార్ స్వామి పిలుపునిచ్చారు. ఇటువంటి రైతు మేళాల ద్వారా అందరికీ నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి ఉండడమే కాకుండా దళారీలు లేకుండా నేరుగా రైతులకే గిట్టుబాటు ధర కలుగుతుంది అని అన్నారు.

ఈ మేళాలో విశాఖపట్నం, విజయనగరం 4, శ్రీకాకుళం 2 తూర్పుగోదావరి 1, అనకాపల్లి జిల్లాలకు చెందిన 8 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ బీ వీ శ్రీరామ్ మూర్తి, సీనియర్ సైంటిస్ట్ శ్రీమతి కె శైలజ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, విశాఖపట్నం అధ్యక్షులైన దాట్ల సుబ్రమణ్యం వర్మ, అగ్రికల్చర్ సైంటిస్ట్ కే అశోక్ కుమార్, భారతీయ విద్యా కేంద్రం అధ్యక్షులు రాపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.