News

గోవు మృతిపై ఐదుగురు సస్పెన్షన్‌

31views

విశాఖపట్నం జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రంలో ఓ ఆవు మృతి చెందిన సంఘటనలో ఐదుగురు వైద్య ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. వివరాలు ఇలా..జీవీఎంసీ 20వ వార్డు పరిధి పోలమాంబ ఆలయ ప్రాంతంలో పిన్నింటి మోహనరావుకు చెందిన చూడితో ఉన్న ఆవు ఈనెల 26న రోడ్డు డివైడర్‌పై ఉన్న మొక్కలు మేస్తుండగా పశు సంరక్షణ కేంద్రం సిబ్బంది పట్టుకొన్నారు. దీన్ని 13వ వార్డు పరిధి దీన్‌దయాల్‌పురంలో ఉన్న జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి సంరక్షణలో ఉన్న ఆవు ఆదివారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకొన్న ఆవు యజమాని మోహనరావు, 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌తో కలిసి సోమవారం కేంద్రానికి చేరుకొని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన ఆవు మృతి చెందిందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోన్‌–2 ఏఎంహెచ్‌వో డాక్టర్‌ కిశోర్‌ కేంద్రానికి చేరుకొని మృతి చెందిన ఆవును పరిశీలించారు. నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, పాడి, చూడితో ఉన్న ఆవులను రోడ్లపై విడిచిపెట్టవద్దని ఆవు యజమానికి సూచించారు.