ArticlesNews

అయ్యా ముఖ్యమంత్రి గారూ….

1.6kviews

ప్రియమైన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు,

ర్మాన్ని పరిరక్షించటం, ధర్మం యొక్క పక్షం వహించడం అందరి కర్తవ్యం. తమ వ్యక్తిత్వం, నేపథ్యం, హోదాతో సంబంధం లేకుండా అందరూ పోరాడి, ధర్మాన్ని సమర్ధించాలి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయంలోనూ, అది నిర్వహించే అన్ని దేవాలయాలలోనూ హైందవేతరులు పనిచేయటాన్ని అనుమతించబోమని చేసిన మీ సాహసోపేతమైన, సముచితమైన ప్రకటన మరియు సమయానుకూల నిర్ణయాన్ని ” గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (GHHF) తరఫున, అభినందించడం నా విధి అని నేను భావిస్తాను. అన్య మతస్థులను తొలగించే సమయంలో హిందూ మతంలోకి పునరాగమనం చేసిన వారికి ఆయా దేవాలయాలలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిసి కూడా సంతోషిస్తున్నాం. హైందవేతరులు హిందూ దేవాలయాలలో కొలువులలో ఉండడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విషయం కనుక వారిని ఆయా కొలువులలో కొనసాగనివ్వలేమని” ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఆ “అన్య మత ఉద్యోగులు తమ ఉద్యోగాలను వెంటనే వదిలేయాలి. వారు హిందువులో కాదో నిర్థారించేందుకు ఉద్యోగుల ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తాం” అని ఆయన ప్రకటించడం అత్యంత అభినందనీయం.

రాష్ట్రం, మతం వేరన్న సూత్రాన్ని పాటించాలని, మత సంస్థల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని GHHF ప్రభుత్వానికి సూత్రప్రాయంగా విజ్ఞప్తి చేస్తోంది. దేవాలయ భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి లేదని, ఆచారాలను దెబ్బ తీసే విధంగా దేవాలయాల నిధులను ఇతర అవసరాల కోసం మళ్లిస్తుండడం సరికాదని మేం విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం కేవలం దేవాలయాల సంరక్షణ మాత్రమే చూడాలి తప్ప, హిందూ దేవాలయాల యజమాని కానేరదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆస్తి అని పలువురు ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. 18-08-2015 తేదీన వెలువరించిన G.O No 298 ని ఓ సారి పరిశీలిద్దాం. “హిందూ దేవాలయాలు, వాటి ఆస్థులు ప్రభుత్వానివి కావు.” ఈ ఆలయాలను ప్రభుత్వం ఎన్నడూ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్మించలేదు. ప్రాచీన కాలం నుండి హిందూ దాతలు, మఠాలు, పీఠాలు, జమీందార్లు మొదలైన వారు మాత్రమే వీటిని నిర్మించారు. ప్రభుత్వం దేవాలయ ఆస్తులకు పవిత్రమైన ధర్మకర్తగా వ్యవహరించడం కోసం మరియు హిందూ సమాజ ప్రయోజనాల కోసం హిందూ దేవాలయాల పర్యవేక్షణ, పరిరక్షణ కోసం ఎండోమెంట్ చట్టాన్ని తీసుకువచ్చింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించరాదు.” అని ఆ G.O చెబుతోంది.

ఈ నేపథ్యంలో హిందూ దేవాలయాల విషయంలో కొన్ని సూత్రాలను, నిబంధనలను, ధర్మాలను పాటించాలని GHHF ప్రభుత్వాన్ని కోరుతున్నది. అందువల్ల హిందూ దేవాలయాల సమగ్రతను, వాటి పవిత్రతను కాపాడడానికి GHHF ప్రభుత్వం నుంచి ఆకాంక్షిస్తున్న చర్యలను ఈ క్రింది జాబితాలో విన్నవించుకుంటున్నది.

ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి వాటి అమలుకు చర్యలు గైకొనవలసినదిగా అభ్యర్దిస్తున్నాం.

1) రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఏ హిందూ దేవాలయాల్లో కూడా హైందవేతరులు కొలువులలో లేకుండా చూసుకోవాలి. వారిని గుర్తించే ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి. వారిని ఇతర ఉద్యోగాలకు బదిలీ చేయాలి.

2) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్. వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నట్లు దేవాలయాల్లో పని చేస్తున్న హైందవేతరులను గుర్తించేందుకు, పరిశీలించేందుకు ఒక సమన్వయ కమిటీ/విజిలెన్స్ కమిటీని నియమించాలి. దేవాలయాలలో వివిధ స్థాయిల్లో ఉన్న హైందవేతరులను గుర్తించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలి.

3) ఒక హిందూ దేవాలయంలోని ఒక ఉద్యోగి తన మతాన్ని నిజాయితీగా నివేదించకపోతే, అతను అబద్ధం చెప్పాడని కనుగొంటే, వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలి. అలాగే అబద్ధం చెప్పడం, ప్రభుత్వాన్ని మోసగించడం, ఆలయ పవిత్రతను దెబ్బతీయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయటం వంటి నేరాలపై సదరు ఉద్యోగిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

4) హిందువులు కాని వారు దేవాలయ పరిసరాలలో దుకాణము నిర్వహించటానికి గాని, ఖాళీ భూములను లీజుకు తీసుకోవడానికి గాని అనుమతించరాదు. పూజా సామాగ్రి, ప్రసాదం లేదా అలంకరణ సామాగ్రిని విక్రయించటానికి హైందవేతరులకు ఎటువంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదు. ఎటువంటి భవన, ఫ్లైఓవర్ల నిర్మాణానికి, లేదా రోడ్లు, పేవ్ మెంట్ నిర్మాణానికి కాంట్రాక్ట్లు ఇవ్వరాదు.

5) స్నేహ లత అనే TTD ఉద్యోగి TTD వాహనంలో చర్చికి వెళ్ళి దొరికినప్పుడు, వివాదం చెలరేగింది. హిందూ సమాజం నుండి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో TTDలో విధుల్లో ఉన్న 44 మంది హైందవేతరులను TTD గుర్తించింది. ఎండోమెంట్ శాఖ వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలనుకుంది.  కానీ ఫిబ్రవరి 2018 లో హైకోర్టు దీనిపై స్టే ఆర్డర్ ఇచ్చింది. దీనిపై మీరు సానుకూలంగా స్పందించి హై కోర్టులో సదరు స్టే ఆర్డర్ ఎత్తి వేసేటట్లు ప్రయత్నించ మనవి.

6) హిందూ దేవాలయ భూములను ఇతరులకు పంపిణీ చేయడానికి గాని లేదా ప్రభుత్వ ప్రయోజనం కోసం గానీ ఉపయోగించ రాదని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయ భూములను అమ్మకూడదు, పంపిణీ చేయరాదు. దేవాలయ భూములు ప్రభుత్వ సొత్తు కాదు. మన పితరులు దేవాలయాల నిర్వహణ, పరిరక్షణ కోసం దూరదృష్టితో దానం చేసిన ఆస్తి అది.

డాక్టర్ మన్మోహన్ సింగ్ 04.07.2019 న “అన్ని జిల్లాల కలెక్టర్ల” కు ఒక మెమో పంపారు.  గౌరవనీయమైన ముఖ్యమంత్రి 25 లక్షల మంది భూమిలేని పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ఆకాంక్షిస్తున్నారని, “ఎండోమెంట్ భూములతోపాటు, దేవాలయాలు/సత్రముల భూములు, హైకోర్టు అనుమతితో వేలం వేయడానికి సిద్దంగా ఉన్న భూములను గ్రామాలవారీగా గుర్తించాలని ఆయన అందులో కోరారు.

మీరు దేవాలయాలు/సత్రములు వేలం వేయడానికి సిద్ధపడితే, అది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. దేవాలయ భూములు అమ్మాలా, వద్దా అనేది నిర్ణయించాల్సింది దేవాలయ బోర్డులు. ఈ దేవాలయ బోర్డులను ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి, వారు ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించి బలవంతంగా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, భూమిని వేలం వేయడానికి అంగీకరించవలసిరావచ్చు.

దేవాలయ భూములను ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించడమంటే, దేవాలయాలను శాశ్వతంగా మూసివేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్టే. ఎందుకంటే ఈ భూములు హిందూ దేవాలయాల యొక్క నిరంతర, నిర్విఘ్న నిర్వహణకు ఉన్న ఏకైక భవిష్యత్ హామీ.

7) 30-08-2019 న, Rc. No. M2 లో దేవాదాయ శాఖ దేవాలయ భూములను ఇంటి స్థలాల కోసం బలవంతంగా తీసుకోరాదని పేర్కొంది. కానీ, ‘ ‘ దేవాలయ స్థాయిలో సంప్రదింపులు జరిపిన తరువాత కార్యనిర్వాహక అధికారులు/ట్రస్టీలు/అర్చకులు ఉపయోగించని, వృధా భూముల అమ్మకానికి ప్రతిపాదనలు ఇస్తే, ఎండోమెంట్ భూమిని తీసుకునే ప్రతిపాదనలను జిల్లా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు.

‘ ‘ కార్యనిర్వాహక అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని సంతోష పెట్టడానికి మాత్రమే వారు అక్కడ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దానిని మాత్రమే వారు అమలు చేస్తారు. ఇలా ప్రతిపాదనలు సమర్పించడం మంచి పద్ధతి కాదు. ఏ హిందూ నాయకులైనా, సంస్థలయినా తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అనుమతించకపోతే,  హిందూ దేవాలయాలకు చెందిన ఏ ఆస్తినైనా అమ్మాలనే నిర్ణయం హిందూ దేవాలయాలపై, హిందువులపై దాడిగానే పరిగణింపబడుతుంది.

“దేవాలయ స్థాయిలో తగు సంప్రదింపుల తర్వాత కూడా ప్రతిపాదనలు పరిగణించబడతాయి” అని మెమో పేర్కొంది. దేవాలయ స్థాయి సిబ్బందిని ప్రభుత్వమే నియమిస్తుందని మనందరికీ తెలుసు. ప్రభుత్వ ఆసక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించేందుకు వారిలో ఎంతమందికి ధైర్యం ఉంటుంది? హిందూ దేవాలయాల గురించి పరిజ్ఞానం వారిలో ఎంతమందికి ఉంటుంది? వారు నిజంగా స్వతంత్రులు అయి వుండి, తమ అభిప్రాయాలను నిజాయితీగా వ్యక్తపరిస్తే వారిని రాత్రికి రాత్రే బదిలీ చేసి, ప్రభుత్వం చెప్పేది వినేవారిని మాత్రమే తీసుకొస్తారు. ఈ వాస్తవాన్ని రుజువు చేయడానికి మనం ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు.

దేవాలయ భూములను కొనుగోలు చేసే ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ భూమి వృథా అని ఎవరు, ఎలా తేల్చబోతున్నారు? నిజానికి వృధా భూమి అంటూ ఏదీ లేదు. హిందువులు, హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లనే ఈ భూములను ఉపయోగించుకోవడానికి అనుమతి లేకుండా పోయింది. ప్రభుత్వాల యొక్క దుర్మార్గమైన విధానాల వల్ల నిరుపయోగంగా పడి ఉన్న భూములవి. వాటిని వృధా భూములుగా నిర్వచించలేము.

8) క్రైస్తవులు, ముస్లింలకు కూడా భూములు అధిక మొత్తంలోనే ఉన్నాయి. ఆ భూములను గుర్తించి, సేకరించి భూమిలేని పేదలకు పంచవచ్చు కదా? డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన మెమో ఇతర విశ్వాసాలకు చెందిన భూముల విషయం ఎందుకు ప్రస్తావించలేదు? ఇది ధర్మమేనా? ఇందులో నీతి ఎక్కడ? కేవలం హిందూ దేవాలయ ఆస్థులను మాత్రమే దోపిడీ చేయడం ఎలా నైతికం?

9) నిజానికి ప్రభుత్వం దర్యాప్తు చేసి ఎన్ని ఎకరాల దేవాలయ భూములను ప్రభుత్వం వాడుకుంది లేదా ఇతరులకు పంపిణీ చేసింది అనే వివరాలను ప్రజలకు నివేదించి ఆయా ఆలయాల నిర్వహణ కోసం ఈ భూములను భర్తీ చేయడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలో చూడాల్సి ఉంది.

10) నిజానికి క్రైస్తవులు, ముస్లింల అధీనంలో కూడా ఎంత భూమి ఉన్నదో ప్రభుత్వం పరిశీలించవలసి ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక్క కాథలిక్ చర్చి ఆధీనంలోనే దేవాలయ భూములన్నింటి కంటే ఎక్కువ భూములు ఉన్నాయని తెలుస్తోంది. భూమిలేని పేదలకు పంపిణీ చేయడానికి వారి భూములను ఎందుకు సేకరించకూడదు? భారత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూమి క్రైస్తవ సంస్థల ఆధీనంలోనే ఉన్నది. ముఖ్యమంత్రి క్రైస్తవుల నుంచి తనకు కావాల్సిన భూములన్నింటినీ తీసుకుని, గృహనిర్మాణ స్థలాలను పంపిణీ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు, చర్చి అధీనంలోని భూములపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. వారది ప్రభుత్వానికి అతీతమైన, ప్రభుత్వానికి సమాంతరమైన వ్యవస్థ. భారత ప్రభుత్వానికి కాకుండా రోమ్ లో పోప్ కు మాత్రమే వారు విధేయులు. ప్రభుత్వాలెన్ని మారినా క్రైస్తవ సంస్థల అధీనంలోని భూముల లెక్కల నిగ్గు తేల్చే పరిస్థితి లేదు. వాటిని సేకరించి భూమి లేని పేదలకు ఎందుకు పంపిణీ చెయ్యకూడదు?

11) అన్యాక్రాంతమైన హిందూ దేవాలయ భూములను గుర్తించి ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించాలి. ఈ భూములలో అక్రమంగా నిర్మించిన ఏ నిర్మాణాన్ని అయినా కూల్చివేసి ఆ భూమిని హిందూ దేవాలయాలకు అప్పగించాలి.

12) ప్రభుత్వం సంవత్సరాలుగా మార్కెట్ విలువ కంటే తక్కువకు వేల ఎకరాల దేవాలయ భూములను విక్రయించింది. వాటిపై పూర్తి విచారణ జరిపించి వాటి కొనుగోలుదారుల నుంచి వాటి పూర్తి ధరను రికవరీ చేయాలి లేదా దేవాలయాలకు ఆ భూములను తిరిగి అప్పగించాలి.

13) అన్ని హిందూ దేవాలయాలలోనూ నగలు మరియు ఇతర విలువైన వస్తువులను రికార్డు చేస్తూఉండాలి. అవి చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్త వహించి, క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. పోయిన నగల విషయంలో, ఇలాంటి విలువైన వస్తువుల రక్షణను పర్యవేక్షించే వ్యక్తిని బాధ్యుణ్ణి చెయ్యాలి.  అతడిని పదవి నుంచి తొలగించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యక్తులపై ఎలాంటి కఠిన చర్యలు లేనట్లయితే, అమూల్యమైన సంపద యొక్క పరిరక్షణ కష్టం అవుతుంది. కఠిన చర్యల కారణంగా ఎదురవబోయే పర్యవసానాలకు భయపడి ఆభరణాలను బాధ్యతగా సంరక్షిస్తారు.

14) హజ్ యాత్ర, జెరూసలేం యాత్ర వంటి ఇతర మతాల కార్యకలాపాలకు హిందూ దేవాలయ నిధులను వాడకూడదు. అన్య మతస్థుల తీర్థయాత్రకు హిందూ దేవాలయాల నిధుల వినియోగం ఏ విధంగా సమర్థనీయం?

15) హిందూ దేవాలయ నిధులను రోడ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి లౌకిక కార్యకలాపాలకు వాడకూడదు. దీనిని ఇతర అవసరమైన దేవాలయాల నిర్వహణ, పునరుద్ధరణ, పూజారి జీతాలు మరియు దళిత వాడలలో దేవాలయాల నిర్మాణం వంటి వాటి కోసం మాత్రమే వినియోగించాలి.

16) ఇమాంలు, ముల్లాలు, పాస్టర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించరాదు. ధార్మిక సంస్థల సమగ్రతను ఖచ్చితంగా కాపాడుకోవాలి. అట్లని తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాని కొన్ని మతాలకు దోచిపెట్టకూడదు.

17) ఇటీవల చేసిన ఒక ప్రకటనలో, దేవాలయాల యొక్క ట్రస్టీలు మరియు బోర్డులలో 50% స్థానాలను SCలు, Bcలు, మరియు STలకు కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. అయితే SC, ST ల ముసుగులో మతం మారిన వారు కూడా దేవాలయ కమిటీలలోకి జొరబడే అవకాశం ఉంది. కనుక దేవాలయ కమిటీలలో కేవలం హిందువులు మాత్రమే నియమితులయ్యేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వాలి.

18) హిందూ దేవాలయాల నిర్వహణలో ఆయా దేవాలయాల ఆచార వ్యవహారాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడం మరియు హిందూ దేవాలయాల వద్ద అన్య మతస్థుల యొక్క కొలువులను నిరోధించటం వంటి పనులను నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్వహించటానికి దేవాదాయ అధికారులందరికీ తగిన శిక్షణ ఇప్పించాలి.

19) రాష్ట్ర సంక్షేమం కోసమని పర్యవసానాలను పరిశీలించకుండానే మీరు పథకాలను ప్రకటించవద్దని మేం మిమ్మల్ని వినయపూర్వకంగా అభ్యర్ధిస్తున్నాం. ఉదాహరణకు, భూమిలేని పేదలకు 25 లక్షల ఇళ్ళ స్థలాలను పంపిణీ చేయాలన్న మీ ప్రకటన దురదృష్టకరం. భూమి లభ్యతపై స్పష్టత లేకుండా ఇలాంటి పథకాలను ఎలా ప్రకటిస్తారు?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26  భారత దేశంలోని ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛను కల్పిస్తున్నదన్న విషయం మీకు తెలుసు.

హిందువుల పట్ల అన్యాయంగా వ్యవహరించరాదని, హిందూ దేవాలయాలలో అన్య మత ఉద్యోగులను అనుమతించరాదని, హిందూ దేవాలయ భూములను పేదలకు ధారాదత్తం చేయరాదని, దేవాలయ బోర్డులు లేదా ట్రస్టులలో హైందవేతర SCలు, STలు, మరియు Bcలను చొప్పించరాదని, హిందూ దేవాలయాల నిధులను అన్య మతాల ప్రయోజనాలకు దారి మళ్ళించరాదని, ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే దేవాదాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని GHHF ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్దిస్తున్నది.

సేకరణ: ‘PGURUS’ నుంచి.

రచన: శ్రీ వెలగపూడి ప్రకాశరావు

అనువాదం : శ్రీరాంసాగర్

https://www.pgurus.com/letter-to-cm-shri-jagan-mohan-reddy-on-banning-non-hindu-at-hindu-temples/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.