News

తిరుమలలో ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ల్యాబ్

39views

తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సిద్ధమైంది. ఇందుకు రూ.22 కోట్లను కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ద్వారా తిరుమల అధికారులతో ఒప్పందం చేసుకోనుంది. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. అన్నదానం, లడ్డూ, ఇతర అవసరాలకు ఏటా రూ.800 కోట్లతో నెయ్యి సహా 30 నుంచి 40 రకాల వస్తువులను తితిదే కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలను పటిష్ఠమైన ప్రత్యేక వ్యవస్థ లేనందున తిరుమల అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు ఆమోదం తెలిపారు. ఇందులో రూ.5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, రూ.9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, రూ.6 కోట్లతో బేసిక్‌ పరికరాలను కొనుగోలు చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంసిద్ధత తెలపడంతో టిటిడి ఈఓ శ్యామలరావు దృష్టికి ఈ విషయం రాగానే గత నెల 6న వైద్య ఆరోగ్య శాఖకు రాసిన లేఖలో రెండు అంతస్తుల్లో ల్యాబ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌కు ఎదురుగానే కొత్త కేంద్రం ఏర్పాటు కానుంది.