News

స్మార్తంతోనే సమాజ శోభితం

17views

స్మార్తంలోని 16 కర్మల ద్వారానే సమాజం నిత్య శోభితమవుతుందని వేద ఘనాపాఠీలు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న బాలాత్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన స్మార్తాగమ అపర విద్వత్సభలో ఘనాపాఠీలు స్మార్త విద్యపై అధ్యయనం చేసి స్మార్త పండితులకు కర్మలను చేసే శాస్త్రోక్త విధి విధానాలను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు యావని వేంకట రామచంద్ర సోమయాజి ఘనపాఠీ అధ్యక్షతన జరిగిన ఈ స్మార్తాగమ విద్వత్సభా వేదికపై టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటకృష్ణ పరిపూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి, తితిదే విశ్రాంత వేద పండితుడు వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి, గరిమెళ్ల విశ్వనాథశాస్త్రి, కర్రా భాస్కరావధానులు, వైఖానస ఆగమ పండితుడు సుదర్శనం జనార్దనాచార్యులు, శైవాగమ విద్వాంసుడు పూజ్యం జగన్నాథశర్మ ఆశీనులై వేదాలు, వేదాంగాలు, స్మార్త, ఆగమ, అపరాల వంటి శాస్త్రాలపై చర్చించారు. స్మార్తంలోని 16 కర్మలను బ్రాహ్మణత్వం ద్వారా బ్రాహ్మణులు సమాజానికి వారు ఎలా ఉపయోగపడాలి. కర్మలు చేయించుకునే వారిని ఎలా సంతృప్తి పరచాలి వంటి అంశాలను వారు వివరించారు. ఉపనయన సంస్కారాలు ఏ సంవత్సరంలో చేస్తే ఎంత ఫలితం ఉంటుందో విశదీకరించారు. వేద, స్మార్త, ఘన విద్యలో ఉన్న నిగూఢ విశిష్టతలు, వాటిని లోక కల్యాణానికి వినియోగించే విధానాలపై స్మార్త పండితులకు ఘనాపాఠీలు లోతైన అవగాహన కల్పించారు. ఈ స్మార్తాగమ అపర విద్వత్సభ శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గుళ్లపల్లి ప్రభాకర ఫణిరాజా, గుళ్లపల్లి వేంకట్రామ్‌ల పర్యవేక్షణలో జరిగింది. స్మార్తంపై చర్చ ముగిసిన తర్వాత ఘనాపాఠీలువేద స్వస్తి, ఆశీర్వచనం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ విద్వత్సభకు సుమారు 200 మంది స్మార్త పండితులు హాజరయ్యారు. చివరగా కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ ఆధ్వర్యంలో స్మార్త పండితులకు సామూహిక సత్కారాలు జరిగాయి.