News

బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ

28views

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా పలు నినాదాలు చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫొటోలు, వార్తలు వెలువడుతున్న దరిమిలా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నేపధ్యంలో గోండియాలో 70కి పైగా హిందూ గ్రూపులకు చెందిన 20 వేల మంది బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా ర్యాలీని చేపట్టారు. జైస్తంభ్ చౌక్ నుండి కిలోమీటరు మేర పాదయాత్ర చేపట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలంటూ వారు ర్యాలీలో నినదించారు.

ర్యాలీలో పాల్గొన్న కొందరు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని అన్నారు. మత ఛాందసవాదులు మైనారిటీ హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, హిందువుల ఇళ్లను ద్వంసం చేసి, వారిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడినప్పుడల్లా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నదని అ‍న్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న హింస, అరాచకాలు, అశాంతి అంతం కావాలని ర్యాలీలో పాల్గొన్నవారు నినదించారు. చివరిగా భారతదేశ జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.