ArticlesNews

సనాతన ధర్మ మూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి శ్రీ నారాయణ గురువు గారు.

25views

( ఆగస్టు 20 – శ్రీ నారాయణ గురువు జయంతి )

ఉత్తర భారతదేశానికి చెందిన సంత్ తులసీదాస్ పరమత పీడనతో హిందూ ధర్మంలోని కులం కంపును ‘రామ రసాయనం’తో కడిగిన గొప్ప కవి, సంస్కర్త. తెలుగు ప్రాంతాల నుంచైతే అన్నమయ్య, వీరబ్రహ్మం, వేమన వంటివారు, బెంగాల్ నుంచి చైతన్య మహాప్రభు, గుజరాత్ నుంచి స్వామి నారాయణ, నర్సీ మెహతా, అస్సాం నుంచి శంకర్ దేవ్ ఇలా ఎందరో మహామహులు సనాతన ధర్మంలోని సత్యాన్ని లోకానికి తెలపడమే కాక సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడ్డారు. హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు. ఆ పరంపరకు చెందిన మరో మహోన్నత వ్యక్తే శ్రీ నారాయణ గురుగారు. ఆది శంకరాచార్యుల వారు అవతరించిన, ‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా చెప్పుకునే కేరళలోనే జన్మించిన నారాయణ గురు… ఆది శంకరాచార్యుల వారి తత్త్వాన్ని తన జీవనం ద్వారా చూపించారు.

కేరళలో ఉన్న కులవ్యవస్థ, వర్ణ వ్యవస్థను గమనించిన స్వామి వివేకానంద అది ఒక పిచ్చాసుపత్రి వంటి ప్రదేశం అని వ్యాఖ్యానించారు. అటువంటి కేరళ రాష్ట్రంలో ఒక అర్థశతాబ్ద కాలంలో నారాయణగురు సామాజిక చైతన్యం తెచ్చారు. కేరళ నేడు విద్యా, సామాజిక రంగంలో దేశంలోనే ముందున్నదంటే అందుకు నారాయణ గురువే కారణం. ఆధ్యాత్మిక చింతనకు ఎటువంటి భంగం కలుగకుండా, దేవాలయాలను, హిందూ మతాన్ని పల్లెత్తుమాట అనకుండా తన వంతు కృషి తాను చేసుకుంటూ పోయి హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు. దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశం దేశం మొత్తం మీద కేరళలోనే ముందు వచ్చిందంటే అది ఈయన కృషి ఫలితమే. హరిజనులకు విద్యా వ్యాప్తి జరిగిందంటే అందుకు ఈయనే కారణం. అంతేకాదు, నారాయణగురు తన భావజాలంతో ఇతర మతాల పెత్తనాన్ని సైతం అడ్డుకున్నారు.

కేరళలోని తిరువనంతపురం సమీపంలోని చెంపజంతి అనే గ్రామంలో ఈళవ అనే హరిజన కులానికి చెందిన మదన్ అసన్, కుటియమ్మ దంపతులకు శ్రీ నారాయణ గురు 1856 ఆగస్టు 20న జన్మించారు. అందరూ ఆయనను ‘నానూ’ అని పిలిచేవారు. తండ్రి, మేనమామ మార్గదర్శనంలో ఇతర ఈళవల మాదిరి తన సంస్కృత పఠనాన్ని కేవలం ఆయుర్వేద రచనలకే పరిమితం చేయకుండా మత గ్రంథాల అభ్యసనకు విస్తరించారు. తండ్రి ద్వారా రామాయణం, మహాభారతాలను అభ్యసించిన ఆయన, తన 21వ ఏట రామన్ పిళ్ళై వద్ద వేదాలు, ఉపనిషత్తులను నేర్చుకునేందుకు ట్రావెన్‌కోర్ వెళ్లాడు. అక్కడ ఒక సంవత్సరం విద్యను అభ్యసించిన తర్వాత తన మేనమామ కూతురు కాళియమ్మను వివాహం చేసుకున్నారు. కానీ, భార్య కొన్నాళ్లకే మరణించడంతో ఆయన సన్యాసి జీవితాన్ని గడిపేందుకు దేశాటనకు బయల్దేరారు. అలా ఆధ్యాత్మిక సంచారిగా మారి ఒకానొక సమయంలో కుంజన్ పిళ్లైని కలిసి ఆయన ప్రోద్బలంతో తైకట్టు అయ్యావును పరిచయం చేసుకొని హఠ యోగాను అభ్యసించారు. అనంతరం 8 ఏళ్ల పాటు నారాయణ గురు దీర్ఘ ఏకాంతంలో జీవితాన్ని గడిపారు.

నారాయణగురు అనంతరం అరవీపురం అడవుల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వనవాసీలకు, హరిజనులకు విద్య, వైద్య సహాయాలను అందించడం ప్రారంభించారు. అదే గ్రామంలో 1888లో శివరాత్రి నాడు ఉదయం వేళ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీనికి అగ్రవర్ణాల వారు అడ్డు తగిలితే, ఇది బ్రాహ్మణ శివలింగం కాదు ఈళవ శివలింగమని బదులిచ్చి మారు మాట్లాడకుండా చేశాడు. అనంతరం ధర్మపరిషత్ స్థాపించి హరిజనులకు విద్య, వైద్య బుద్ధులు నేర్పడంతో పాటు త్రిస్సూర్, కన్నూర్, అంచుతెంగు, తెల్లిచ్చేరి, కాలికట్, మంగళూరు తదితర ప్రదేశాల్లో ఆలయాలను నిర్మించడం ప్రారంభించారు. ఈ దేవాలయాల్లో విద్య, ఆరోగ్య అంశాలకు ప్రాధాన్యత కల్పించారు. 1912లో శివగిరిలో శారదా దేవి ఆలయాన్ని నిర్మించారు.

అన్ని మతధర్మాల సారం ఒక్కటేనని చెప్పేందుకు నారాయణ గురు 1924లో సర్వమత సమావేశం నిర్వహించారు. నారాయణగురుకున్న సంస్కృతభాష పరిజ్ఞానం, వేదాంత విజ్ఞానం, కవిత్వం, పురాతన గ్రంథాలలోని అంశాలను వివరించే తీరుకు కేరళ సమాజం అంతా తల వంచింది. అలా ఆయన తన స్వీయధర్మాన్ని సంస్కరించడంతో పాటు క్రైస్తవ మత వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. క్రైస్తవులుగా మారిన ఎందరో హిందువులను తిరిగి స్వధర్మం వైపు మళ్లించారు. కేరళ సమాజంలోని అత్యున్నత స్థానం కలిగిన నంబూద్రిలు కూడా ఆయనను గురువుగా అంగీకరించారు. కేరళ, తమిళనాడు ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేస్తూ విద్య, విజ్ఞాన వ్యాప్తికి నారాయణగురు కృషి చేశారు. శివగిరి, కాలడి సమీపంలో ఆశ్రమాలు స్థాపించారు. 1925లో ప్రసిద్ధ వైకోమ్ సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తన బోధనలు అనుసరించేవారు కలిసికట్టుగా పని చేయడం కోసం 1926లో శ్రీ నారాయణ ధర్మ సంఘం స్థాపించారు.

ప్రేమ మరియు మానవత్వాన్ని చాటే తన సుదీర్ఘ ప్రయాణం తర్వాత శారదా మఠానికి చేరుకున్న నారాయణ గురు తన 73వ ఏట అంటే 1928 సెప్టెంబర్ 20న తన శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యం అయ్యారు. నారాయణగురును కలుసుకున్నవారిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ ఉన్నారు. శ్రీ నారాయణగురు వంటి మహోన్నత మహర్షి దర్శనం పొందడం తన భాగ్యమని గాంధీజీ అంటే, నారాయణగురును మించిన ఆధ్యాత్మిక వేత్తను తానెన్నడూ చూడలేదని విశ్వకవి ప్రశంసించారు. నారాయణగురు వంటి మహనీయుని స్ఫూర్తితో సామాజిక సమరసత దిశగా మనందరం కృషి చేయాలి. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.