ArticlesNews

సంపూర్ణ సమాజ రక్షణకు సమాజమే ‘రక్ష’

52views

(ఆగష్టు 19 – రాఖీ పూర్ణిమ)

హిందూ సమాజంలోని కుటుంబాల ద్వారా సోదరులకు సోదరీమణులు రక్షా సూత్రాన్ని కట్టే పండుగ రూపంలో రక్షాబంధన్ ప్రచారంలో ఉంది. భారతీయ ప్రజలతో ప్రాచీన కాలం నుండి రక్షాబంధన్‌కు గాఢమైన సంబంధం ఉంది. పురాతన భారతీయ పరంపరలో సమాజానికి మార్గదర్శకులుగా గురువు ఉండేవారు. ఈ దేశపు జ్ఞానపరంపరను రక్షించే సంకల్పాన్ని మిగిలిన సమాజంతో ఈ రక్షా సూత్రం ద్వారా చేయించేవారు. సాంస్కృతిక, ధార్మిక పురోహిత వర్గం కూడా రక్షాసూత్ర మాధ్యమంగా సమాజానికి రక్షా సంకల్పం చేయించేది. రాజ్య వ్యవస్థ లోపల రాజ పురోహితుడు రాజుకు రక్షాసూత్రం కట్టి ధర్మం, సత్య రక్షణతో బాటు మొత్తం ప్రజల రక్షణ సంకల్పాన్ని చేయించేవాడు. ప్రస్తుతం కూడా ఎలాంటి ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమం జరిగినా తర్వాత రక్షాసూత్రం ద్వారా అందులో పాల్గొన్న వారందరితో రక్షణ సంకల్పం చేయించడం జరుగుతోంది. మొత్తం మీద రక్షా బంధన్ మౌలిక భావన ఏమిటంటే సమాజంలో శక్తి సంపన్న వర్గానికి తన శక్తి సామర్థ్యాల పరిచయం, బాధ్యతను గుర్తు చేసి సమాజంలో శ్రేష్ట విలువల, సమాజ రక్షణ సంకల్పాన్ని ఇప్పించడమే.

సంఘ సంస్థాపకులు పరమపూజనీయ డాక్టర్‌జీ హిందూ సమాజంలో సమరసత నింపాలని భావించారు. సమస్త హిందూ సమాజం పరస్పరం కలిసి మెలిసి హిందూ సమాజ రక్షణ సంకల్పం తీసుకునే బాధ్యతను తెలియజెప్పడానికి ఈ రక్షాబంధన్ పండుగను, సంఘ తన ఆరు ఉత్సవాల్లో భాగం చేసుకుంది. ఎందుకంటే, రక్షా బంధనం అనేది విశ్వాసానికి సంబంధించిన పండుగ. సంఘ ఈ ఉత్సవం ద్వారా కోట్లాది స్వయంసేవకుల మాధ్యమంగా సమాజంలో విశ్వాసాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తోంది. రక్షాబంధన్ ఉత్సవంలో స్వయంసేవకులు పరమ పవిత్ర భగవాధ్వజానికి రక్షాసూత్రం కట్టి సంకల్పాన్ని స్మరించుకుంటారు. ధర్మో రక్షతి రక్షిత: అన్నదే ఆ సంకల్పం. సమాజంలోని విలువలను రక్షించాలి. మన శ్రేష్ఠ పరంపరలను రక్షించాలి. అపుడే ధర్మం సంపూర్ణ సమాజాన్ని రక్షించడంలో బలశాలి అవుతుంది. ఇది ధర్మపు వ్యవహారిక పక్షం. మన వ్యవహారంలో ప్రపంచ కళ్యాణకారకమేది ఉందో అది ధర్మం. ధ్వజానికి రక్షాసూత్రం కట్టడంలోని ఉద్దేశ్యం కూడా ఇదే. సమాజ హితం కోసం ఉదాత్త పరంపరని రక్షించాలి. స్వయంసేవకులు ఒకరితో ఒకరు స్నేహ సూత్రం కట్టుకుంటారు. రక్షాబంధనమనే స్నేహసూత్రం కులం, మతం, భాష, ధనం, విద్య, సామాజిక ఉచ్చనీచభేదాలను తొలిగిస్తుంది. ఈ సూత్రాన్ని కట్టుకున్నప్పటి నుండి స్వయంసేవకులు పరస్పరం ఆత్మీయ భావనతో బంధింపబడతారు.

స్వయంసేవకులు తమ సమాజంలోని వేర్వేరు బస్తీలకు వెళ్లి తరతరాలుగా వంచితులుగా, ఉపేక్షితులుగా పిలవబడేవారికి రక్షాసూత్రం కడతారు. వంచితులు, ఉపేక్షితుల మధ్య కూర్చొని వాళ్ళకు రక్షాబంధన్ కట్టడమేగాక, శ్రీకృష్ణుడు చెప్పిన ‘సమానం సర్వభూతేషు’ అనే మాటలను వల్లె వేస్తారు. దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, సంపూర్ణ సమాజపు రక్షణను, సంపూర్ణ సమాజమే వ్రతంలా స్వీకరించాలి. శక్తివంతమైన, సమరసత, సంస్కారంతో కూడిన సంపన్న సమాజమే ఏ దేశపు శక్తికైనా ఆధారమవుతుంది. సంఘ ఆ సమాజ నిర్మాణ పనిలోనే ఉంది. రక్షాబంధన్ ఉత్సవం ఈ మహోద్యమపు చరణ రూపం.

శ్రావణ పౌర్ణిమను భారతదేశంలో అన్నాచెల్లెళ్ళ ప్రేమ, రక్షణకు గుర్తుగా ‘రక్షా బంధన్’ పండుగగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో జరుపుకునేది కాబట్టి శ్రావణి, సావనీ అని పిలువబడుతోంది. శ్రావణ పూర్ణిమను పశ్చిమ భారతదేశంలో(విశేషంగా కొంకణ్, మలబార్) కేవలం హిందువులు మాత్రమే గాక ముస్లింలు, పార్శీలు సముద్ర తీరానికి వెళ్ళి సముద్రానికి పుష్పాలు సమర్పించి, కొబ్బరికాయ కొడతారు. శ్రావణ పౌర్ణిమ రోజున సముద్రంలో తుఫాన్లు తక్కువగా వస్తాయి. అందుకే వ్యాపార నౌకలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో సముద్రుడికి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ముంబైలో సముద్రతీర ప్రాంతంలో రక్షాబంధనాన్ని ‘కొబ్బరి పూర్ణిమ’ లేదా ‘కోకోనట్ ఫుల్‌మూన్’ అనే పేరుతో వ్యవహరించడం ఉంది. బుందేల్ ఖండ్‌లో రక్షాబంధనాన్ని ‘కజరీ పూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. ఆ రోజున గిన్నెలో బార్లీ లేదా వడ్లను నాటడం జరుగుతుంది. ఏడు రోజులు నీరు పోయడంతో పాటు, భగవతీ మాతకు వందనం చేయడం జరుగుతుంది. 1905లో ఆంగ్లేయులు బెంగాల్ విభజనకు పూనుకోగా రవీంద్రనాధ ఠాగూర్ బెంగాలీల మధ్య పరస్పర సోదరభావనకు ప్రతీకగా రక్షాబంధనాన్ని ప్రచారం చేసి, రాజకీయ ఆయుధరూపంలో ప్రయోగించారు. ఏదిఏమైనా, రక్షాబంధన్ అనేది బంధాలకే కాదు రక్షకు గుర్తు అని చెప్పకనే చెబుతోంది.