News

బంగ్లాదేశ్‌లోని హిందువుల సంక్షేమానికి భారత్ భరోసా ఇవ్వాలి: ఆర్.ఎస్.ఎస్.

59views

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను పరమ పూజనీయ సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్‌గారు ఖండించారు. బంగ్లాదేశ్‌లో నివసించే హిందువులు ఎటువంటి కారణం లేకుండా హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఎలాంటి దౌర్జన్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నాగ్‌పూర్‌లోని ఆర్.ఎస్.ఎస్. ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడారు. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనుకునే వ్యక్తులు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటారు కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉంటూ మనల్ని మనం రక్షించుకోవాలని సర్‌సంఘ్‌చాలక్‌గారు సూచించారు. ఈ విషయంలో స్వతంత్రత(స్వేచ్ఛ) యొక్క ‘స్వా’ను రక్షించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.

పరిస్థితులు అన్ని వేళలా ఒకేలా ఉండవని, ఒకసారి సానుకూలంగా ఉంటే మరోసారి ప్రతికూల వాతావరణం ఉంటుందని మోహన్ భాగవత్ గారు అన్నారు. పొరుగు దేశంలోని హిందువులు అకారణంగా దాడులకు గురవుతున్న విషయాన్ని నేడు మనం చూస్తున్నామన్నారు. ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని, ఎవరు ఎలా ప్రవర్తించినా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడాన్ని మనం చూశామని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలకులు మన దేశం సురక్షితంగా ఉండేలా చూడాలని, అదే సమయంలో ఇతర దేశాలకు సాయం అందేలా చూడాలని మోహన్ భాగవత్‌గారు స్పష్టం చేశారు.