News

బంగ్లా అల్లర్లు: భారత్‌కు ఉగ్ర ముప్పు!

67views

రిజర్వేషన్‌ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మైనర్టీలు, హిందూవులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

షేక్‌ హహీనా ప్రభుత్వాన్ని దించడానికి నిరసనలు చేపట్టిన వారంతా విద్యార్థలుగా కనిపించినప్పటికీ.. మైనార్టీలు, హిందూవులపై దాడులను గమనిస్తే వారివెనక ఉగ్రసంస్థల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో కలిసి.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వ మార్పు ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) పాత్ర, జమాత్-ఇ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్( ఏబీటీ) తో ఇతర నిషేధిత గ్రూపుల ప్రత్యక్ష మద్దతు ఉన్నట్ల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఎల్‌ఈటీ సహకారంతో ఏబీటీ 2022లో భారత్‌లో దాడులను చేయటమే లక్ష్యంగా బెంగాల్‌లో స్థావరాన్ని స్థాపించినట్లు నిఘా అధికారులు తెలిపారు.

త్రిపురలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎల్‌ఈటీ ఏబీటీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు గతంలో ఇంటెలిజెన్స్‌కి సమాచారం వచ్చింది. దాదాపు 50 నుండి 100 మంది ఏబీటీకి చెందిన ఉగ్రవాదులు త్రిపురలోకి చొరబడాలని ప్లాన్ చేస్తున్నాయని 2022లో నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధం ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు.