News

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం

48views

భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ప్రచారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఐఐటీ మద్రాస్, అశోకా విశ్వవిద్యాలయాల తర్వాత తాజాగా అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా జెండాలు ధరించి పాల్గొన్నారు.

గత ఆదివారం అంటే ఆగస్టు 4న అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 80 మంది విద్యార్ధులు తమ భుజాలకు పాలస్తీనా జెండాలు తగిలించుకుని వచ్చారు. వాటితోనే తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు స్వీకరించారు. అంతేకాదు, అజీమ్‌ ప్రేమ్‌జీకి సంబంధించిన విప్రో సంస్థ ఇజ్రాయెల్ కంపెనీలతోనూ, టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంతోనూ సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసారు.

‘‘ఇజ్రాయెల్‌కు చెందిన బహుళజాతి సంస్థల్లోనూ, ఇతర విద్యాసంస్థలలోనూ విప్రో యాజమాన్యం తన పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని మేం డిమాండ్ చేసాం. పాలస్తీనాలో నరమేధానికి నిధులు సమకూర్చవద్దన్నదే మా డిమాండ్’’ అని విద్యార్ధులు వెల్లడించారు.

ఆ వ్యవహారంపై విశ్వవిద్యాలయం ఆచితూచి స్పందించింది. ‘‘పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ కొందరు విద్యార్ధులు ఆ దేశపు జెండాలను ధరించి వచ్చారు. స్నాతకోత్సవం ప్రశాంతంగా, ఎలాంటి అలజడులూ లేకుండా పూర్తయింది. మాకు తెలిసి విశ్వవిద్యాలయం ఆవరణలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలూ జరగలేదు’’ అని ఏపీయూ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేసారు.

అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి నిధులు సమకూరుస్తున్నది ప్రధానంగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్. విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీయే ఆ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసారు. విప్రో సంస్థకు టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంతోనూ, మరికొన్ని ఇజ్రాయెలీ సంస్థలతోనూ రిసెర్చ్ పార్ట్‌నర్‌షిప్‌ ఉంది.

‘‘అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ దాతృత్వ కార్యక్రమాలకు మంచిపేరుంది. అదే సమయంలో ఆ సంస్థ ఇజ్రాయెలీ సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకోవడం ద్వారా పాలస్తీనాలో నరమేధానికి తమవంతు సహకారం చేస్తోంది. విప్రో కంపెనీ ఇజ్రాయెల్‌లో పెట్టుబడులు పెట్టడం మానేయాలి, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలి’’ అని ఒక విద్యార్ధి చెప్పుకొచ్చాడు.

స్నాతకోత్సవానికి కొన్నిరోజుల ముందు ఏపీయూ క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించారు. దానికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేసారు. అయినప్పటికీ వర్సిటీ అధికారులు అలాంటి సంఘటన జరగనే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.