News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: 15 ప్రధాన దృష్టాంతాలు

65views

భారతదేశాన్ని ముక్కలు చేసి బ్రిటిష్ వారు సృష్టించిన కృత్రిమదేశం పాకిస్తాన్‌నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్… రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్‌కు నకలుగా మారిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడక్కడ విద్యార్ధుల ఆందోళన ముసుగులో మొదలైన రగడ, హిందువులపై అత్యాచారాల హింసాకాండగా పరివర్తన చెందింది. షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి భారత్‌కు శరణార్థిగా వచ్చిన వారం రోజుల్లో, ఆ దేశంలో ఇస్లామిస్టులు చెలరేగిపోయారు. ఆ దేశంలోని హిందువులను, ఇతర ముస్లిమేతర మైనారిటీ ప్రజలనూ నిర్మూలించడమే లక్ష్యంగా అపరిమిత హింసాకాండకు పాల్పడ్డారు.

హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పాలనలో హిందువుల పరిస్థితులు ఇప్పటికంటె కొద్దిగా మెరుగ్గానే ఉండేవని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీల జోడీ… హిందువులే తమ లక్ష్యమని నేరుగానే ప్రకటించి, వారిని నిర్బంధిస్తున్నారు. షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో పడదోయడం ఆ దేశంలో మైనారిటీలైన హిందువులకు ముప్పుగా పరిణమించింది.

ఢాకా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ అబుల్ బరకత్ అధ్యయనం ప్రకారం, వ్యవస్థీకృతంగా జరుగుతున్న హింసాకాండ కారణంగా 2050 నాటికి బంగ్లాదేశ్‌లో హిందువులు మొత్తానికి తుడిచిపెట్టుకుపోతారు. దేవాలయాల విధ్వంసం, భూముల ఆక్రమణలు, తప్పుడు ఆరోపణలతో మూకదాడులు, విద్వేష ప్రసంగాలు, మహిళలపై మానభంగాలు, బలవంతపు మతమార్పిడులూ… అనేవి హిందువులను నిర్మూలించే ప్రక్రియలో కొన్ని ఉపకరణాలు మాత్రమే అని ఆ అధ్యయనం స్పష్టంగా వివరించింది.

గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ అధ్యయనం నిజమే అని నిరూపించేలాగే ఉన్నాయి. ఈ వారంలో బంగ్లాదేశీ హిందువులపై జరిగిన ప్రధాన దాడుల ఘట్టాలను పరికిద్దాం…

1. ఖుల్నా డివిజన్ మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ ఆలయంపై ముస్లిములు దాడి చేసారు. శ్రీకృష్ణ, బలరామ, సుభద్రాదేవి విగ్రహాలను ముక్కలుముక్కలుగా ధ్వంసం చేరసారు. ఆలయం మొత్తాన్ని కాల్చిబూడిద చేసారు.

2. మౌల్వీబజార్ జిల్లాలోని కాళీమాతా మందిరానికి ముస్లిముల మూక నిప్పుపెట్టింది.

3. కోమిల్లాలో ఒక మందిరంపై దాడి చేసి దాని ద్వారాన్ని విరగ్గొట్టేసారు. దేవతామూర్తులను ధ్వంసం చేసారు.

4. రంగ్‌పూర్‌లో హిందూ కౌన్సిలర్లు హరాధన్ రాయ్, కాజల్ రాయ్‌లను మూకదాడిలో చంపేసారు.

5. సిరాజ్‌గంజ్‌లో పాత్రికేయుడు ప్రదీప్‌కుమార్ భౌమిక్‌ను హత్య చేసారు.

6. ఖుల్నాలో పోలీస్ కానిస్టేబుల్ సుమన్ ఘరామీని హత్య చేసారు.

7. బోగురా జిల్లా పీర్‌గాచాలో హిందువుల కాలనీపై దాడి చేసారు. హిందూ కుటుంబాలను హింసించారు. హిందువుల ఇళ్ళను ధ్వంసం చేసారు. ఆస్తులను లూటీ చేసారు. హిందూ మహిళలను మానభంగం చేసారు.

8. తనుశ్రేయా భట్ నివాసంలోకి దూరి, ఆమెతో సహా ఇంట్లో ఉన్న ఆడవారినందరినీ హింసించి, ఇల్లు లూటీ చేసారు.

9. పబ్నా, సూజానగర్‌లలో హిందువుల ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. లూటీ చేసారు. మహిళలు, పిల్లలు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ సహాయం చేయలేదు.

10. ఠాకూర్‌గావ్‌లో హిందువుల ఇళ్ళు, వ్యాపార సంస్థల మీద ముస్లిములు దాడులు చేసి కొల్లగొట్టారు.

11. మాగురా జిల్లాలో హిందువుల దుకాణాలు, వ్యాపార సంస్థలపై ముస్లిములు దాడి చేసి, వాటిని నాశనం చేసారు. మహమ్మద్‌పూర్‌ మార్కెట్‌లో బాబుల్ ఛటర్జీ, సుకాంతా చక్రబొర్తిల దుకాణాలను లూటీ చేసి ధ్వంసం చేసారు.

12. మేమెన్‌సింగ్‌ జిల్లాలోని నాసిరాబాద్ ప్రాంతంలో హిందువుల ఇళ్ళపై ముస్లిములు దాడి చేసారు. మొదట ఇళ్ళను దోచుకుని, తర్వాత ధ్వంసం చేసి, చివరగా నిప్పుపెట్టి తగులబెట్టేసారు.

13. రాఖాల్‌గాచీ యూనియన్‌లోని పైక్‌పరా గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడు మృణాల్ కాంతి ఛటర్జీని క్రూరంగా హింసించి చంపేసారు. అతని భార్య, కుమార్తెలకు కూడా తీవ్రగాయాలయ్యాయి.

14. జెస్సోర్ జిల్లాలో హిందువులు ఎక్కువగా ఉండే సహాపూర్ ప్రాంతాన్ని అతివాదులు ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకుని దాడులు చేసారు. ఆ ప్రాంతంలోని 90శాతం దుకాణాలు హిందువులవే. వాటన్నింటినీ దోచుకుని, ధ్వంసం చేసారు.

15. బ్రాహ్మణబరియా ప్రాంతంలో వాసుదేవ్ సాహా ఇంటిని, దుకాణాన్ని దోచుకుని ధ్వంసం చేసారు.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఒక అంచనా ప్రకారం, దేశంలోని 52 జిల్లాల్లో 205 దాడులు జరిగాయి. హిందూ మహిళలపై అత్యాచారాలు ఎన్ని జరిగాయో లెక్కే లేదు. షేక్ హసీనాను దేశం నుంచి తరిమేసాక ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం హిందువులను రక్షిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నా, వాటిని నమ్మేవారు ఎవరూ లేరు.