News

ఇరాక్ లో బాలికల వివాహ వయసు 9 ఏళ్లే! పార్లమెంట్ లో అనాగరిక బిల్లు

36views

బాలికల వివాహ వయసును తొమ్మిదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ ఇరాక్‌ ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. 1959 పర్సనల్‌ స్టేటస్‌ లా ప్రకారం ప్రస్తుతం వివాహానికి చట్టబద్ధమైన వయసు 18సంవత్సరాలుగా వుంది. దీన్ని తొమ్మిదేళ్లకు తగ్గించనున్నారు. ఈ అనాగరిక, వివాదాస్పద బిల్లుపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ప్రస్తుతం ఇరాక్‌లో బాలికల వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుత బిల్లు పాస్‌ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ రయీద్‌ అలీ మాలికీకి స్వలింగ సంపర్కం, లింగమార్పిడి శస్త్రచికిత్సలను నేరంగా పరిగణించే వ్యభిచార వ్యతిరేక చట్టంతో సహా పలు వివాదాస్పద సవరణలను ప్రతిపాదించిన చరిత్ర ఉంది.

ఇరాక్‌లో ఇప్పటికే 28శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోందని గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే ఏడు శాతం మందికి 15వ ఏడు వచ్చిన వెంటనే పెండ్లి జరిపించారు. ఇదే గనక అమల్లోకి వస్తే ఇక బాల్య వివాహాలు ఎక్కువవుతాయని, మహిళల హక్కులు దెబ్బతింటాయని మహిళా హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇరాక్‌ న్యాయ శాఖ తీసుకొచ్చిన ఈ వివాదాస్పద బిల్లు పర్సనల్‌ స్టేటస్‌ లాను సవరించాలని భావిస్తోంది.

ప్రతిపాదిత బిల్లుపై ఇప్పటికే సామాజిక కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బాగ్దాద్‌లో ఆందోళనలు, ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దేశం ముందుకు కాకుండా వెనక్కి వెళుతుందని మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ పరిశోధకులు సారా శాన్‌బార్‌ వ్యాఖ్యానించారు.

ఈ సవరణ గనక అమలైతే కుటుంబ వ్యవహారాల్లో పురుషుల ఆధిపత్యం మరింత ఎక్కువవుతుందని ఇరాకీ వుమెన్స్‌ నెట్‌వర్క్‌ సభ్యురాలు తెలిపారు. కుటుంబ వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మతపెద్దలు కావాలా లేక పౌర న్యాయ వ్యవస్థ వుండాలా అని తేల్చుకోవడానికి పౌరులకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. ఈ బిల్లు వల్ల వారసత్వం, విడాకులు, పిల్లల కస్టడీ వంటి అంశాల్లో మహిళల హక్కులు కాలరాయడానికి దారి తీస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు.