News

బంగ్లాదేశ్ నుంచి తిరిగివచ్చిన 400 మంది భారతీయులు

48views

బంగ్లాదేశ్ లో ఉంటున్న మనోళ్లలో 400 మందికి పైగా తిరిగి వచ్చారు. ఎయిర్ ఇండియా, ఇండిగో స్పెషల్ ఫ్లైట్లలో వాళ్లు ఇండియాకు చేరుకున్నారు. ‘‘ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ మంగళవారం రాత్రి బంగ్లాదేశ్ లోని ఢాకాకు వెళ్లింది. 205 మంది ప్రయాణికులను తీసుకుని బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరిలో 199 మంది పెద్దవాళ్లు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు” అని అధికారులు తెలిపారు. అలాగే ఇండిగో స్పెషల్ ఫ్లైట్ ఢాకా నుంచి కోల్ కతాకు 200 మందికి పైగా ప్రయాణికులను తీసుకొచ్చిందని చెప్పారు.

మరోవైపు ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ నుంచి 190 మంది నాన్ ఎస్సెన్షియల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. వాళ్లను ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ లో 20–30 మంది సీనియర్ సిబ్బంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

కాగా, ఢాకాకు తమ రెగ్యులర్ సర్వీసులను ప్రారంభించామని ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా ఎయిర్ లైన్ కంపెనీలు ప్రకటించాయి. బంగ్లా పరిస్థితే భారత్ లోనూ రావచ్చన్న ఖుర్షిద్.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్ లోనూ రావొచ్చని కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ కామెంట్ చేశారు. ‘‘కాశ్మీర్ లో అంతా బాగున్నట్టే కనిపించొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నట్టే ఇక్కడ కూడా ఆందోళనలు జరగొచ్చు” అని ఆయన అన్నారు.

కాగా, సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ దేశంలో అరాచకాన్ని కోరుకుంటున్నదని ఫైర్ అయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభం ప్రతి డిక్టేటర్ కు ఓ గుణపాఠం లాంటిదని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పాలనే బలమైన భావన బంగ్లాదేశ్ లో ఉన్నది. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి రాకుంటే, ఆమెను కూడా చంపేసేవారు” అని అన్నారు.