ArticlesNews

మహాభారత యుద్ధానికి కారకులు ఎవరు?

347views

కురుక్షేత్ర సంగ్రామానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఎవర్ని అడిగినా సులభంగానే జవాబులు చెబుతారు దుర్యోధనుడు అని. ఎందుకంటే మొదటి నుంచి దుర్యోధనుడికి పాండవులమీద ద్వేషమే! పాండవులని అంతమొందించాలని దుర్యోధనుడు చేయని పని లేదు. విషం పెట్టించాడు. లక్క ఇంటిని తగలబెట్టిం చాడు. మాయా ద్యూతంలో ఓడించాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించాడు. పాండవులను అడవులపాలు చేశాడు. అటువంటి దుర్యోధనుడే యుద్ధానికి, సర్వనాశనానికి కారణం. దుర్యోధనుడు కాకపోతే ఇంకెవరు అవుతారు కారణం? వాడు పాపాత్ముడు. వాడి పాపం పండింది. బద్దలయింది. తత్ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామం సంభవించింది. కురు వంశం భష్మీభూతం అయింది. ఇదీ ఎవరు చెప్పినా! దీనికే చిలవలు పలవలు చేర్చి చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.

ఉదాహరణకు ధృతరాష్ట్రుడే ఇంత జరగడానికి మూల కారణము అనేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి పుత్ర వ్యామోహం ఎక్కువ. దుర్యో ధనుడిని కాదని బతకలేడు ఆయన. కాదని ఉంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? ఒకవేళ దుర్యోధనుడు. తండ్రికి ఎదురు తిరిగాడనుకుందాము. వాడిని కాదనగలవాడే ధృతరాష్ట్రుడు. అట్టివాడు దుర్యోధనుడిని రాజ్య బహిష్కరణ చేయ వచ్చు. లేదా దండించవచ్చు. అంటే సంహరించవచ్చు కూడా. ఒకవేళ తప్పనిసరి అయితే! ధృతరాష్ట్రుడిని తప్పుపట్టే వాళ్లు ఎవరూ లేరు. ఒక్కడు ఛస్తే, ఇంత యుద్ధం, ఇంతమంది చావటం ఎలాజరుగుతుంది? ఆ ఒక్కడు బ్రతికి ఉంటంవల్ల అటు, ఇటు దాదాపుగా అందరూ హతమైనారు. అందరూ అంటే? అక్షౌహిణులు! కాబట్టి దుర్యోధనుడిని క్షమించి ఊరుకొన్న ధృతరాష్ట్రుడే కారణం అంటారు. ఇది సబబుగానే కనిపిస్తుంది.

అలాగే మహాభారతయుద్ధం జరగడానికి భీష్ముడు కారణం అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. భీష్ముడు అంటే ఎవరు? కురువంశానికి మూల విరాట్టు. భీష్ముడు లేకపోతే కౌరవులూ లేరు, పాండవులూ లేరు. ధృతరాష్ట్రుడు లేడు, పాండురాజూ లేడు, వాళ్ల తండ్రులూ లేరు, కురువంశానికి కుదురు వంటివాడు భీష్ముడు, మహాపరాక్రమశాలి, పరశురాముని సైతము ఎదిరించినవాడు. అంతేకాదు, సర్వధర్మ మర్మజ్ఞాత, అట్టి భీష్ముడు కౌరవసభలో ఉన్నాడు. భీష్ముడి మాట కాదని ధృతరాష్ట్రుడు ఏమి చేయ గలడు? దుర్యోధనుడు ఏమి చేయగలడు? ఒకవేళ భీష్ముడ్ని తిరస్కరిస్తే వారికి గుణపాఠం నేర్పలేడా భీష్ముడు? నేర్పగలడు. నయాన చెప్పగలడు. భయాన అయినా చెప్పగలడు. కాదు కూడదు అంటే కౌరవసభలో నుంచి నిష్క్రమించడం కూడా భీష్ముడి చేతిలోని పనే. భీష్ముడు లేకపోతే ఇక కౌరవ సైన్యం అనేది ఉన్నా లేనట్లే లెక్క తన శక్తి సామర్థ్యాలు తెలిసిన భీష్ముడు, న్యాయాన్యాయాలు, ఉచితాను చితాలు, ధర్మాధర్మాలు తెలిసిన వాడు కిమ్మనకుండా కూర్చున్నాడే కాని, అవసరమైన పని చేశాడా? చేస్తే యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఒకవేళ జరిగినా ఇంత సైన్య నష్టము లేకుండా భీష్ముడే మట్టుపెట్ట వచ్చునే. దుర్యోధనుడిని, అతని సోదరులనే అలా చేయలేదు. అందుకని యుద్ధము జరిగింది. కనుక భీష్ముడే కారణం యుద్ధానికి! ఇది కూడా సమంజసం గానే తోస్తుంది.

ఇంకా విచిత్రంగా కొంతమంది పాండురాజు యుద్ధానికి కారణమని చెబుతారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పెద్దవాడయినా అంధుడు కావటంచేత రాజ్యార్హతలు కోల్పోయినాడు. సరే, పాండురాజుని రాజు అన్నారు. పాండురాజు సింహాసనము మీద కూర్చోవచ్చుగా! అన్నగారిపై భక్తిప్రపత్తులు ఎక్కువై, అన్నగారినే గద్దెపైన కూర్చుండబెట్టి కథ నడిపించాడు. ఇందులో ఆ క్షణాన తప్పనిపించే విషయం లేకపోవచ్చు. కాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి? దుర్యోధనుడికి రాజ్యకాంక్ష పుట్టింది. రాజు ధృతరాష్ట్రుడు కదా! ఆయనకు పెద్దకొడుకు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు దిష్టిబొమ్మ మాత్రమే అని అంటే ఒప్పు కొంటాడా వాడు? కౌరవపాండవులలో ధర్మరాజే వయస్సులో పెద్దవాడన్నప్పటికీ అంగీకరిస్తాడా దుర్యోధనుడు? ఎందుకు అంగీకరిస్తాడు? వాడు క్రోధ పరవశుడు, మాత్సర్య పూరితుడు. అట్టివాడి దురా లోచనకు దుశ్చర్యలకు అవకాశం ఎందుకు ఏర్పడింది?