News

దుర్గగుడి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించండి

52views

అమరావతి రాజధాని ప్రాంతంలోని అతి పెద్ద, ప్రాచీన దేవాలయం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్దికి ప్రసాద్‌ పథకం కింద రూ. 100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) విజ్ఞప్తి చేశారు. గురువారం, కేంద్ర మంత్రితో భేటీ అయినా ఎంపీ ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తరువాత అతి పెద్ద దేవస్థానంగా శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధి పొందిందని తెలిపారు. రోజుకి అమ్మవారిని 25,000 మంది భక్తులు దర్శించుకుంటారని, శుక్ర, శని, ఆదివారాలలో 50,000 మందికి పైగా భక్తులు తరలివస్తారని వివరించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలు, నిర్మాణాల ప్రతిపాదనల వివరాలను ఎంపీ వివరించారు. భక్తులకి అవసరమైన అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ అభివృద్దికి ప్రసాద్‌ పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. తన అభ్యర్థనపై కేంద్రమంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించింనట్లు ఎంపీ కేశినేని తెలిపారు.