News

అమరావతి స్థూపాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలి

36views

ఎంతో పురాతనమైన అమరావతి స్థూపాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 46వ సమావేశంలో కోరామని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 46వ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఫోన్‌లో సమావేశ వివరాలను తెలియజేశారు. రాష్ట్రంలోని గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరంలలోని కట్టడాలు, స్థూపాలకు ప్రపంచ వారసత్వ కట్టడాల హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారకాల చరిత్ర అపూర్వమని తెలియజేశామని తెలిపారు. శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో మాత్రమే చేర్చిందన్నారు. శాశ్వత జాబితాలో చోటు దక్కే విధంగా కొన్ని సమస్యలను అధిగమించి యునెస్కో నియమ నిబంధన ప్రకారం నివేదిక తయారుచేసి పంపటానికి కృషి చేయాలన్నారు. జూలై 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భారతమండపంలో ప్రారంభమైన ఈ సమావేశంలో 165 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 129 కట్టడాలలో ఒక్క దానిని కూడా యునెస్కో ఫైనల్‌ జాబితాలో చోటు లేకపోవటాన్ని సమావేశం దృష్టికి తెచ్చామన్నారు. భారతీయ సంస్కతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ, కుఢ్య చిత్రాలకు నిలయమైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వత జాబితాలో చేర్చాలని వివరించామన్నారు. యునెస్కో తాత్కాలిక జాబితాలోకి ఎంతో ఘన చరిత్ర ఉన్న అమరావతి, నాగార్జునకొండ, గండికోట, సాలిహుండం, శంకరం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరామన్నారు. ఈసమావేశాలలో తెలుగు రాష్ట్రాల నుంచి స్తపతి ప్లీచ్‌ ఇండియా సీఈఓ, పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారని తెలిపారు.