ArticlesNews

పాదుకా పట్టాభిషేకం – గురుస్థానంలో ధర్మం

54views

సీతారామ లక్ష్మణులు నిర్జరాణ్యంలో చిత్రకూట పర్వతం చెంత ఆశ్రమం నిర్మించుకున్నారు. వనవాస సౌఖ్యాన్ని చవి జూస్తున్నారు. ఇక్కడ భరతుడు అయోధ్యకు వచ్చాడు. విషయాలు తెలుసుకున్నాడు. తల్లిని చివాట్లు పెట్టాడు. ‘ఈ రాజ్యం నాది కాద న్నాడు’. ‘రాముణ్ణి మళ్లీ తీసుకొని వచ్చి రాజ్యాన్ని అప్పగిస్తానన్నాడు. “రాముడి దగ్గరకు పోదాం పద” అన్నాడు. అనటమేమిటి! చతురంగ బలాలతో బయలుదేరాడు కూడా. రాముడి దగ్గరకు పోయి, “అన్నా, రాజ్యం నీది.. నీది నీవే ఏలుకో, నేను నీ బంటును” అని విన్నవించుకున్నాడు. రాముడిది ఒకటే మాట. “మనం తండ్రి మాట విందాం, వినాలి. ఆయన నన్ను అడవికి పొమ్మన్నాడు. నిన్ను రాజ్యమేలమన్నాడు. ఎవరి పని వాళ్లు చేయటం సబబు”. భరతుడు ఒప్పుకోలేదు.

రాముడూ ఒప్పుకోలేదు. భరతుడు ‘ధర్ణా చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష పూనుతాను” అన్నాడు. భరతుని సత్యాగ్రహోద్యమం విఫలమయింది. విశ్వేతిహాసంలో ప్రప్రథమ సత్యాగ్రహం అది. అది ఇలా విఫలమయింది. తరువాత దాని జాతకం అలాగే ఉంటూ వచ్చింది. రాముని మాట శిరోధార్యమయింది.

భరతుడు అప్పుడొక మాట చెప్పాడు “రామా! నేను నీ సింహాసనం మీద కూర్చోవటం కల్ల. ఈ పాదుకలమీద నీ చరణాలు ఉంచు. వీటిని సింహాసనం మీద ప్రతిష్ఠిస్తాను. ఈ నీ పాదుకలనే నీవు అనుకుంటాను’. రాముడు ఏ సమాధానం చెప్పగలడు? తండ్రి చెప్పలేదు అని అనగలడా? ఇందులో రాముడి మాట నెగ్గిందో! భరతుడి మాట నెగ్గిందో చెప్పటం కష్టం. ఇద్దరి మాట నెగ్గినట్టే. ఇది విచిత్రంగా ఉంటుంది. కాని వాస్తవం ఇదే.

భరతుడు తనకు గురుస్థానంలో ఉన్న రాముని పాదుకలను సింహాసనం మీద ఉంచాడు. వాటికి పట్టాభిషేకం జరిపించాడు. వాటిల్లో రాముణ్ణి చూస్తున్నాడు. ప్రతిదీ ఆ పాదుకలకు నివేదిస్తాడు. తరువాత అమలుచేస్తాడు. పాదుకా పట్టాభిషేకం పరమ రమణీయం. సుగ్రీవుని పట్టాభిషేకం, విభీషణుడి పట్టాభిషేకం అవి కాదు పట్టాభిషేకాలు. పాదుకాపట్టాభిషేకమే పట్టాభిషేకం.

పాదుకలు అంటే పద రక్షణాధారాలు. గురు చరణారవింద నివాస స్థానాలు. గురుధ్యాన యోగమని ఒకటి ఉంది. మొదట ద్వాదశార్ణ పద్మం. అందులో అకధాది త్రికోణం. దానిలో నాదబిందుమణిపీఠ మండలం. దానిపై హంస పీఠం. అందులో గురుచరణావిందాలు ఉంటాయి. వాటిని భావన చేయాలి. ధ్యానం చేసి సందర్శించాలి. భరతుడు చేసిన పని ఇది. రామ పాదారవింద ధ్యాననిరతుడు భరతుడు. ధర్మమార్గ రక్షణ తత్పరుడు. భరతుడికి రాముడే దైవం, గురువు. రాముడు ధర్మానికి ప్రతీక. ధర్మాన్ని గురుస్థానంలో నిలుపుకున్నాడు. భరతుడు. పాదుకలను నవరత్న ఖచిత సింహాసనంపై అలంకరింపచేశాడంటే అర్థం ఇదే.

రాజై కూడా తాను రాజు అనీ అనుకోలేదు భరతుడు. రాజలాంఛనాలు అంగీకరించలేదు. జటావల్కలధారియై మునివేషధరుడై నంది గ్రామంలో ఉండి పాలించాడు. అయోధ్యలో కూడా కాదు. ధర్మరాజ్యానికి ఇంతకంటే అవధి భూతమయిన ఆదర్శంఉండదు. యుధిష్ఠిరుని రాజ్యానికి ధర్మ రాజ్య మని పేరు. కాని భరతుని రాజ్యం అసలైన అర్థంలో ధర్మరాజ్యం. ఇంతకూ రామభరతుల నడుమ ఏర్పడ్డ వివాద స్వరూపఏమిటి? రాజ్యం నాదంటే నాది అనే పెనుగులాట కాదు. “ఈ రాజ్యం నాది కాదు, నీది” అంటాడు రాముడు. “కాదు ఈ రాజ్యం నీదే, నాది కాదు” అంటాడు భరతుడు. ఇది మన పరంపర.