News

విజయనగరంలో అక్రమ కబేళా గుట్టు విప్పిన గోసంరక్షులు

47views

పశువులపై కొందరు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ.. అక్రమంగా కబేళాలు నిర్వహిస్తూ వాటిని పొట్టన పెట్టుకుంటున్నారు.. ఇలాంటి పశువధ కేంద్రం గుట్టును రట్టు చేశారు విజయనగరం పోలీసులు, గోసంరక్షకులు. లోపలికి వెళ్లి పరిశీలించగా.. వారికి భీతావహ దృశ్యాలు కనిపించాయి. వందలకొద్దీ పశువులను దగ్గరగా కట్టేసి ఉంచారు.. కొన్నింటి కాళ్లు నరికేశారు.. మరికొన్నింటిని అప్పటికే కోసి, మాంసంగా విడదీశారు. ఈ మేరకు స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది..
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 14వ డివిజన్‌ కొత్తపేట కుమ్మరివీధి సమీపంలోని రోటరీ స్వర్గధామం దారిలో ఏళ్లుగా పశువధ కేంద్రం నడుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు దాడులు జరిగాయని, అనేకసార్లు మూసివేయించినా స్థానిక నాయకుల సహకారంతో యథేచ్ఛగా సాగుతోందని గోసంరక్షకులు ఆరోపించారు. శనివారం రాత్రి ఈ కేంద్రానికి పశువులతో రెండు వాహనాలు వచ్చాయి. అప్పటికే నిఘా వేసిన స్పార్క్‌ సొసైటీ ప్రతినిధులు వెళ్లి గేట్ల వద్ద ఆందోళన చేశారు. ఈలోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ బయటకు రాకుండా ఆదివారం వరకు అక్కడే ఉన్నారు. దీంతో రెండో పట్టణ సీఐ వెంకటరావు సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు.

పెద్దఎత్తున స్వాధీనం..
లోపలున్న సుమారు 4 క్వింటాళ్ల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న పశువులను సమీపంలోని పశుశాలలకు పంపించారు. మాంసాన్ని నిల్వ ఉంచేందుకు తెచ్చిన ఐస్‌తో పాటు కంటైనర్లను స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేశామని సీఐ వెంకటరావు చెప్పారు. దాడుల్లో ఎస్సైలు దుర్గాప్రసాద్, మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
భయానక పరిస్థితులు..

కబేళా దాదాపు మూడు ఎకరాల స్థలంలో ఉండగా.. అంతటా రక్తం ఏరులై పారుతోంది. ఎక్కడికక్కడే కుళ్లిన మాంసం, ఎముకలు కనిపించాయి. షెడ్లలో పశువులు కదల్లేని స్థితిలో దర్శనమిచ్చాయి. అప్పటికే చాలావాటిని నరికేశారు. కొన్నింటి కాళ్లు నరికి ఓ గదిలో వధకు సిద్ధం చేశారు. మరోచోట ఎముకలు, కొన్ని విడిభాగాలను ఉడికిస్తున్నారు. ఇక్కడ నిషేధిత నూనె తయారు చేస్తున్నట్లు గోసంరక్షకులు గుర్తించారు.

ఇలా ఎక్కడికక్కడే చంపి పడేసిన గోవులు
కంటోన్మెంట్‌ ఘటనతో వెలుగులోకి..

ఇటీవల కంటోన్మెంట్‌ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ శాలను కొందరు డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఆ దృశ్యాలు కలకలం రేపడంతో గోసంరక్షకులు మిగిలిన వాటిపై దృష్టిసారించారు. కొత్తపేట కేంద్రానికి తరచూ పశువులు రావడం, వెళ్లడాన్ని గమనించారు. పోలీసుల సాయంతో విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇలాంటివి నగరంలో మరో 8 వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి వి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. తక్షణమే కేంద్రాన్ని మూసివేయాలని డిమాండు చేశారు. గోవధను అడ్డుకోవాలని సమితి పట్టణాధ్యక్షుడు ఎం.సోంబాబు నినదించారు. నిర్వాహకులపై రౌడీషీట్‌ తెరవాలని ఏపీ సంరక్షణ సమాఖ్య అధ్యక్షుడు ఎల్‌.రామకృష్ణ కోరారు. ఇప్పటికే సదరు వ్యక్తులపై కేసులున్నా పోలీసులు పట్టించుకోలేదని, వారి వెనుక కొందరు వైకాపా నాయకులు ఉన్నారని ఆరోపించారు. కేంద్రాన్ని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి సాంబమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించారు.