News

వరుస ఉగ్రఘటనలు.. జమ్మూకు రెండు వేలమంది అదనపు బలగాలు

55views

జమ్మూ-కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో వరుస ఉగ్రఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ దాడుల్లో సైనికులతోపాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జమ్మూలో భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించనుంది. ఇందుకోసం దాదాపు రెండువేల మందికిపైగా సిబ్బందితో కూడిన రెండు బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్లను జమ్మూ ప్రాంతానికి తరలిస్తోంది. ప్రస్తుతం ఒడిశాలో మావోయిస్టుల ఏరివేతలో నిమగ్నమైన బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిని తక్షణమే జమ్మూకు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, రియాసి, కఠువా, ఉధంపుర్‌, దోడా జిల్లాలు ఇటీవలి కాలంలో ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాదిలో 11 మంది భద్రత సిబ్బంది సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు ఇటీవల తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేశాయి. ఉగ్రవాదులకు మద్దతిచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇప్పటికే 4000 మంది భద్రతా దళాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు జిల్లాల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌లతో వారిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.