ArticlesNews

జాతి అస్తిత్వ చిహ్నాలివి!

47views

వరసగా వచ్చేదే వారసత్వం. ముందు తరం ఇచ్చిందీ, ఈతరం అందుకొని, రేపటితరం అందుకోబోయేది వారసత్వం. ప్రకృతి అందాలకు నెలవులైన కొండలు, కోసలు, వాగులు, వంకలు, చెట్లూ చేమలు, జంతువులు, పిట్టలు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపు రూప కళాఖండాలు కనిపించే వారసత్వ చిహ్నాలు. పాడితేనే వినిపించే పాట, ఆడితేనే కనిపించే ఆట. ప్రదర్శిస్తేనే తిలకించే నృత్యం, ఇంద్రజాలం, పండుగలు, ఆచార వ్యవహారాలు కనిపించని వారసత్వ అంశాలు. అన్నింటినీ పరిరక్షించుకొనే బాధ్యత అందరిపై ఉంది. ప్రపంచ వారసత్వ కమిటీ తాజా సమావేశాల్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ- “వారసత్వమంటే కేవలం చరిత్ర మాత్రమే కాదు. అది కృత్రిమ సరిహద్దుల్ని చెరిపి, వసుధైక కుటుంబమన్న భావనను పెంపొందించే మొత్తం మానవాళి ఉమ్మడి భాగస్వామ్య స్పృహ” అని వ్యాఖ్యానించారు. ఇది గత వైభవ ప్రాభవాలను నేటి తరానికి జ్ఞప్తికి తెస్తూ, భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు.

దక్కని గుర్తింపు
ప్రపంచ మానవులంతా ఒక్కటేనన్న భావనతో ప్రతి దేశం తన వార సత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను యునెస్కో 1972 నుంచి గుర్తు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 168 దేశాల్లో 933 సాంస్కృతిక, 227 ప్రాకృ తిక, 30 మిశ్రమ ప్రదేశాలు కలిపి మొత్తం 1190 ప్రపంచస్థాయి వార సత్వ స్థలాలు, కట్టడాలను యునెస్కో గుర్తించింది. మనదేశంలో 34 సాంస్కృతిక, ఏడు ప్రకృతి సంబంధ, ఒక మిశ్రమ ప్రదేశాలను కలిపి మొత్తం 42 ప్రపంచ వారసత్వ స్థలాలు, కట్టడాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ఒక్కటే ఆ జాబితాలో చోటు దక్కించుకొంది. తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. కానీ, అవి తగిన గుర్తింపు నోచుకోవడం లేదు. ఆదిమ మానవుని అడుగుజాడలతో పాటు చేయి తిరిగిన చిత్రకారులు కూడా అచ్చెరువొందే తెలంగాణలోని పాండవులగుట్ట, ఆంధ్రప్రదేశ్ లోని జ్వాలాపురం, యాగంటిలో ఉన్న శిలా యుగపు చిత్రకళకు ప్రాచుర్యం రాలేదు. అమరావతి శిల్పకళకు, బౌద్ధ వాస్తుకళకు అద్దం పడుతున్న తెలంగాణలోని ఫణిగిరి, ఏపీలోని శంకారం, శాలిహుండం గురించి చాలామందికి తెలియదు. తెలంగాణ లోని అలంపూర్ నవ బ్రహ్మేశ్వరాలయాలు, నగునూరు,ఆలయ సముదాయాలు, ఆంధ్రప్రదేశ్లోని ముఖలింగం, లేపాక్షి దేవాలయాలు విలక్షణ వాస్తు విన్యాసానికి ప్రతీకలు. తెలంగాణలో గోల్కొండ కోట, ఏపీలో గుత్తి, గండికోట, కొండవీడు స్థల, గిరి దుర్గాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. ఐరోపా శైలికి మేలి ఉదాహరణలుగా ఆంధ్రప్రదేశ్ లోని వెంకటగిరి, బొబ్బిలి, విజయనగరం, చల్లపల్లి, తెలంగాణలోని దోమకొండ, కొల్లాపురం రాజప్రసాదాలు నిలి చాయి. ఇవన్నీ యునెస్కో గుర్తింపు కోసం వేచి చూస్తున్నాయి. రోజుకో వరస రాళ్లూడుతున్న రామగిరి కోట, కళ్లముందు కనుమరుగైన హైదరాబాద్ షేక్పేట, విజయవాడ దగ్గరి కొలనుకొండ ఇనుప యుగపు కట్టడాలు, నేడో రేపో కూలడానికి సిద్ధంగా ఉన్న మందని గౌతమీశ్వరాలయం, ఆనవాళ్లే లేకుండా పోయిన తెలుగువారి తొలి రాజధాని కోటిలింగాల, సిరిసిల్ల దగ్గరి అనంతగిరి కోట, జడ్చర్ల సమీపంలోని అపురూప ఇటుక రాతి జైన దేవాలయం- చరిత్రను పదిలపరచుకోవడంలో మన నిర్లక్ష్యానికి నిదర్శనాలు. తెలుగునేలపై విలసిల్లిన కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, త్యాగధనుల ఇళ్లను జాతీయ స్థాయి స్మారక చిహ్నాలుగా ప్రకటించడానికి చొరవ చూపాలని వారసత్వ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఏపీలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టు నీటి ముంపులో మునుగుతున్న దేవాలయాలను జల సమాధి నుంచి బయట పడేయాల్సిన అవసరం ఉంది.

అలసత్వం వీడాలి
చరిత్రను చిన్నచూపు చేసే వారికి వర్తమానంలో విలువలేదు. గతాన్ని మర్చిపోయిన వారికి అసలు భవిష్యత్తే లేదన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఏ జాతి తన మూలాల్ని, అస్తిత్వ చిహ్నాల్ని కాపాడుకొం టుందో, అది మాత్రమే కాలగమనంలో మనగలుగుతుంది. ఈ వాస్త వాన్ని గుర్తించినప్పుడే తెలుగు జాతి కూడా వెలుగొందుతుంది. వార సత్వం పట్ల ఇకనైనా అలసత్వం వీడాలి. తమిళనాడులో నాలుగు, కర్ణాటకలో మూడు కట్టడాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న సంగతిని స్ఫూర్తిగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాలు ఈ దిశగా పావులు కదపాలి. మన చారిత్రక ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు సాధించడానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

(రచయిత- సీఈవో, ప్లీన్ఇండియా ఫౌండేషన్ )