ArticlesNews

భారత్‌ బలానికి, సహనానికి కార్గిల్ విజయగాథే నిదర్శనం : ప్రధాని మోదీ

50views

దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్‌ 25 వ విజయ దివస్‌ సందర్భంగా ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి, ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్గిల్‌ యుద్ధానికి లద్దాఖ్‌ సాక్షి అని అన్నారు. అమరుల త్యాగాలకు గుర్తుగానే విజయ దివస్‌ జరుపుకుంటున్నామని, భారత్‌ బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథే నిదర్శనం అని ప్రకటించారు. ఈ మాతృభూమి కోసం తమ ప్రాణాలర్పించిన సైనికులు ఎల్లప్పటికీ గుర్తుండిపోతారన్నారు.

ఇక ఈ సందర్భంగా దాయాది పాక్‌పై ప్రధాని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ దేశం గతంలో చేసిన తప్పుల నుంచి ఏమాత్రం గుణపాఠాలు నేర్చుకోలేదని దెప్పిపొడిచారు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేక పోగా.. ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. లద్దాఖ్‌ వేదికగా తాను మాట్లాడుతున్న ఈ మాటలు ఉగ్రవాదులను తయారు చేస్తున్న దేశానికి కచ్చితంగా వినిపిస్తూనే వుంటాయని పరోక్షంగా పాక్‌ను దెప్పిపొడిచారు. పాకిస్తాన్‌ ఎన్ని దుర్మార్గపు కుట్రలు పన్నినా..అవి ఎన్నటికీ ఫలించవని, వారి ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడి, వారికి తగిన జవాబు భారత బలగాలు ఇస్తాయని మోదీ ప్రకటించారు. తాము పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించేస్తామని స్పష్టం చేశారు.

అగ్నిపథ్‌ పథకం అనేది సైన్యం చేసిన అవసరమైన సంస్కరణలకు ఓ ఉదాహరణ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. కానీ.. కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం దానిని కూడా రాజకీయం చేశారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సైన్యాన్ని అత్యంత యవ్వనంగా మార్చడమే అగ్నిపథ్‌ లక్ష్యమని, అలాగే సైన్యాన్ని నిరంతరం యుద్ధానికి తగినట్లుగా వుంచడమే మరో లక్ష్యం కూడా దానివెనుక నిబిడీకృతమై వుందని వివరించారు. అయితే.. కొందరు ఇంత సున్నితమైన జాతీయ భద్రతతో ముడిపడి వున్న అంశాన్ని కూడా తమ రాజకీయాల కోసం వాడేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారే అనేక వేలకోట్ల అవినీతి పనులు చేసి మన సైన్యాన్ని నిర్వీర్యం కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్లమెంటు నుండి వివిధ కమిటీల వరకు సైన్యాన్ని యవ్వనంగా మార్చడంపై చర్చలు జరుగుతున్నాయని, అయితే.. సైనికుల సగటు వయస్సు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా వుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అందుకే కొన్నాళ్లుగా అనేక కమిటీల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, కానీ… ఎలాంటి పరిష్కారాలు రాలేదన్నారు. అగ్నిపథ్‌ పథకం ఈ ఆందోళనను కొంత దూరం చేసిందని ప్రకటించారు.

తనకు తన పార్టీ ముఖ్యం కాదని, దేశమే అత్యున్నతమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తాము రాజకీయం కోసం పనిచేయడం లేదని, దేశహితం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. దేశభద్రతే తమకు అత్యంత ప్రాధాన్యతా అంశమని, 140 కోట్ల మంది శాంతిగా వుండటమే తమ లక్ష్యమన్నారు. తమ దృష్టిలో సైన్యం అంటే 140 కోట్ల మంది దేశవాసుల విశ్వాసమని, 140 కోట్ల మంది శాంతికి హామీ అని, దేశ సరిహద్దుల భద్రతకు హామీ అని మోదీ ప్రకటించారు.