News

సింధూరం, మంగళసూత్రంపై టీచర్ సంచలన వ్యాఖ్యలు.. సస్పెండ్ చేసిన అధికారులు

58views

ఒక కీలక పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అది రాజకీయమే కావొచ్చు.. సినీ రంగమే కావొచ్చు.. విద్యారంగమైనా కావొచ్చు. టీచర్ అయితే మరీ బాధ్యతగా మాట్లాడాలి. అసలే సోషల్ మీడియా కాలం. అంతర్గత మీటింగ్స్‌లో మాట్లాడిన విషయాలే బయటకు వచ్చి రచ్చవుతున్నాయి. ఇక బహిరంగ సమావేశంలో ఏమైనా మాట్లాడితే ఊరుకుంటారా? నానా రచ్చ చేసేస్తారు. మరీ ముఖ్యంగా టీచర్ స్థానంలో ఉన్నవారు ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నడుచుకోవాలి. తాాజాగా ఓ టీచర్ సింధూరం, మంగళసూత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు మన సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపేలా ఉన్నాయి. గిరిజన సంఘం మహిళలంతా ఆ టీచర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఆ టీచర్ సస్పెండ్ అయ్యారు. ఇంతకీ ఆ టీచర్ ఎవరు? ఏం మాట్లాడారో చూద్దాం.

ఆ మహిళ టీచర్ పేరు మేనకా దామోర్. ఆమె గిరిజన మహిళలను సింధూరం పెట్టుకోవద్దని.. మంగళసూత్రం ధరించవద్దని బహిరంగ వేదికపై చెప్పారు. ఆమె మాటలు కాస్తా వైరల్ అవడంతో రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. రాజస్థాన్ ప్రవర్తనా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు విద్యాశాఖ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడినందుకు మేనకా దామోర్‌పై చర్యలు తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు గురువారం తెలిపారు. జులై 19న బన్స్వారాలోని మంగర్ ధామ్‌లో మెగా ర్యాలీ ఒకటి జరిగింది. ఈ మెగా ర్యాలీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని గిరిజన సంఘాలకు చెందిన వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దామోర్ మాట్లాడుతూ.. పండితులు చెప్పే మాటలను గిరిజన మహిళలు పాటించకూడదని చెప్పారు.

గిరిజన కుటుంబాలకు చెందిన మహిళలు సింధూరం పెట్టుకోవద్దు.. అలాగే మంగళసూత్రం ధరించవద్దు. గిరిజన సొసైటీకి చెందిన మహిళలు, బాలికలు చదువుపై దృష్టి సారించాలి. మనమేమీ హిందువులం కాదు.. ఈ ఆచార వ్యవహారాలన్నీ పాటించాల్సిన అవసరం లేదు. దామోర్ వ్యాఖ్యలపై గిరిజన సంఘం మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దామోర్ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. దామోర్‌ వ్యాఖ్యలపై స్పందించిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు.