News

మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ అభ్యంతరం

69views

నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా, ఉగ్రవాదులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. స్వదేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తాము కృషి చేస్తున్న తరుణంలో ఆమె ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది. ఈ మేరకు భారత్‌కు అధికారికంగా తమ అభ్యంతరాన్ని చేరవేసింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఈ విషయాన్ని గురువారం విలేకర్ల సమావేశంలో ధ్రువీకరించారు. రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్‌ ఇటీవల అట్టుడికింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో ఈ నెల 21న మమత మాట్లాడుతూ.. నిస్సహాయ స్థితిలో బెంగాల్‌ తలుపు తట్టే బంగ్లాదేశ్‌ ప్రజలకు కచ్చితంగా ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఆమె వ్యాఖ్యలు గందరగోళం సృష్టించేలా ఉన్నాయని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి హసన్‌ మహ్మద్‌ ‘ఎక్స్‌’లో ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మెప్పు కోసం పొరుగు దేశం విషయంలో రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయొద్దని మమతకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.