
దిల్లీ: బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5వేల కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణశాఖ వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు. దీనిని విజయవంతం చేసిన డీఆర్‌డీవో అధికారులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. లక్షిత బాలిస్టిక్ క్షిపణిని సాయంత్రం 4.20 గంటల సమయంలో ప్రయోగించారు. దీనిని భూమి, సముద్రంలో ప్రతిష్టించిన రాడార్ ఆయుధ వ్యవస్థ గుర్తించింది. వెంటనే ఇంటర్‌సెప్టర్ యాక్టివేట్ అయింది. 4.24 గంటలకు ఫేజ్-2 ఏడీ ఎండో-అట్మాస్ఫియరిక్ క్షిపణిని చాందీపుర్ నుంచి ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ శత్రువులకు చెందిన అనేక క్షిపణులను అడ్డుకోగలుగుతుంది.





