ArticlesNews

భక్తిలో పరవశించిన గోదాదేవి

62views

పాండ్య రాజ్యంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఓ నగరం ఉంది. ఆ నగరంలో విష్ణుచిత్తుడు అనే పరమ భక్తుడున్నాడు. వటపత్రశాయిగా ప్రసిద్ధుడైన శ్రీ మహా విష్ణువును ఆయన నిత్యం పూజించేవాడు. ఆయన ఒక విశాలమైన తులసివనం పెంచుతుండే వాడు. ఓ రోజూ ఆ వనంలో తిరుగుతూ ఓ తులసి చెట్టు మూలాన్ని తవ్వి పాదు చేస్తుండగా అపరంజి బొమ్మలాంటి శిశువు కనబడిరది. ఆ శిశువుని భగవంతుడే అనుగ్రహించాడని భావించిన విష్ణుచిత్తుడు ఇంటికి తీసుకువెళ్ళి ఆమెకు ‘గోదై’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటు న్నాడు. వారింటనున్న దైవభక్తి గోదై కూడా పుణికి పుచ్చుకుంది. దీన్నే ఆధ్యాత్మిక వారసత్వం అంటారు. ఈ మధ్యకాలంలో పిల్లలను ఆధ్యాత్మిక సంస్కారం నేపధ్యంలో పెంచాలని పలువురు సూచిస్తున్నారు. అనతికాలంలోనే ఆమె తండ్రిమార్గంలో కృష్ణుడి పట్ల భక్తిని పెంచుకున్నది. ఇరుగుపొరుగుతో స్నేహం చేసి, ప్రేమగా ఉంటున్న గోదాను అందరూ ఆండాళ్‌ (పరిపాలించేవ్యక్తి) అని పిలవసాగారు. మనసలో కృష్ణుణ్ణి తప్ప మరొకరిని పెళ్లాడరాదని భావించింది.

విల్లిపుత్తూరులోని విష్ణు ఆలయంలో స్వామి అలంకరణకై విష్ణుచిత్తుడు నిత్యం తులసి మాలలు కట్టి తీసుకెళ్లెవారు. గోదా ఆ మాలలను ముందు తాను ధరించేది. ఈ విషయం విష్ణుచిత్తుడికి తెలియదు. ఒకరోజు స్వామివారికి తీసుకెళ్ళే మాలల్లో విష్ణుచిత్తుడికి తల వెండ్రుక కనపడిరది. దేవుడికి అపచారం జరిగిందని భావించిన విష్ణుచిత్తుడు తాజాగా మరో మాలకట్టి తీసుకెళ్ళి స్వామికి సమర్పించాడు. ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామి విష్ణుచిత్తుడికి కనబడి స్వచ్ఛమైన భక్తి సుగంధాలు వెదజల్లుతూ గోదాకంఠసీమను అలంకరించి విడిచిన మాలలే తనకిష్టమైనవని చెప్పారు. విష్ణుచిత్తుడికి తన కుమార్తె గొప్పతనం తెలిసింది. తరువాతి తారాలన్నీ గోదాను తమిళంలో చూడిక్కొడుత్తచుడర్‌కోడి (ముందుగా తాను ధరించి ఆ తరువాత పూమాలలను భగవంతుడికి అర్పించిన వ్యక్తి) అని ముద్దుగా పిలిచాయి. సంస్కృతంలో గోదాను ‘అముక్తమాల్యద’ అన్నారు. రోజులు గడిచిన కొద్దీ గోదా విల్లి పుత్తూరును బృందావనంలా భావించసాగింది. తనను తాను బృందావనంలో గోపికగా భావించు కుంది. నియమ నిష్ఠలతో విష్ణువును పూజించింది. పూర్వం కృష్ణుడ్ని భర్తగా పొందడానికి గోపికలు ఆచరించిన ధనుర్మా వ్రతాన్ని ఆచరించింది. 30 రోజుల పాటు వ్రతం ఆచరించి 30 పాశురాలు వ్రాసింది. దీన్నే ‘తిరుప్పావై’ అంటారు. ఆమె సఖులను సహచార గోపికలుగా భావించి వారిని నిద్రలేపేందుకు పాశురాలు పాడేది. తెల్లవారక ముందే లేచి, ఒళ్లు గడ్డకట్టే చలిలో చన్నీటి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని ఆలయంలో ఒకచోట చేరేవారు. వివిధ రకాల సేవలందించేవారు. ఇది కదా వయసు వచ్చిన ఆడపిల్లలకు ఉండవలసిన ఆదర్శంతమైన సంస్కారం! గోదా భగవంతుడితో సహా అందరికీ బోధించేది. ఆమె భగవంతుణ్ణి కూడా మేలుకొలిపేది. అదే ఆమె భక్తి పరవశంలోని రహస్యం. స్నేహితురాళ్లకు భక్తితో ఆహారానికి, అలంకారానికీ సంబంధించిన కఠిన నియమాల్ని తెలియజేప్పేది. వారిని ప్రోత్సహించేది. గోదాభక్తికి శ్రీ కృష్ణుడు లొంగిపోయాడు. విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగం తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకి కూడా ఈ విషయం తెలియజేశాడు. విష్ణుచిత్తుడు ఆనందపడ్డాడు. పెళ్ళికుమార్తెగా గోదాదేవిని, విల్లిపుత్తూరు ప్రజలను తీసుకుని శ్రీరంగం బయలుదేరాడు. అది సంక్రాంతికి ముందు రోజు బోగి. పెళ్ళికుమార్తెగా రంగనాథుడి గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి రంగనాథుడిలో ఐక్యమైపోయింది. అందుకే భోగిరోజున గోదా రంగనాథుల కళ్యాణం వైష్ణవాలయాల్లో నిర్వహిస్తారు. భగవంతుని సేవలో ఆడంబరం అవసరంలేదని, చిత్తశుద్ధి కావాలని, భగవంతుణ్ణి అర్చిస్తే వానలు కురిసి పంటలు పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని, గోదాదేవి చెబుతుంది. పెళ్ళి కాని ఆడపిలలలు ధనుర్మాస వ్రతం ఆచరిస్తే పెళ్లి అవుతుందని హిందువుల విశ్వాసం.

– హనుమత్‌ ప్రసాద్‌