ArticlesNews

శుభప్రదం.. శంఖనాదం

47views

హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యాన్ని పూరిస్తాడు. అలా అధర్మం మీద యుద్ధం ప్రకటించడానికి శంఖం పూరించడం అనేది ఓ పదబంధంగా మారిపోయింది. ఇక ఆయుర్వేదం ప్రకారం శంఖాన్ని ఊదటం శరీరంలో వాత, కఫ దోషాలను సమతూకంలో ఉంచుతుంది. శ్వాసను నియంత్రించడం ద్వారా ఇది మన శరీర శక్తిని సమన్వయపరుస్తుంది. దీంతోపాటు శంఖనాదం పరిసరాలను శుద్ధిచేస్తుంది. సానుకూల శక్తి తరంగాలను ఉత్పత్తి చేసి ప్రతికూలతలను తొలగిస్తుంది.

ప్రయోజనాలు
శంఖనాదంతో ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి సరైన పద్ధతిలో, దాన్ని తగిన విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది.
మొదటగా శంఖాన్ని మీరు బాగా ఉపయోగించే చేతితో గట్టిగా పట్టుకోవాలి. గాలి ప్రవాహాన్ని నియంత్రించేలా పట్టు ఉండేలా చూసుకోవాలి. రెండో చివరను పైకి ఎత్తి ఉంచాలి.
తర్వాత ముక్కుతో ఊపిరితిత్తులు పూర్తిగా నిండిపోయేలా దీర్ఘంగా శ్వాసించాలి. ఇది మీకు శంఖాన్ని పూరించేందుకు తగిన గాలిని సమకూరుస్తుంది.
ఆ తర్వాత మొదటి కొసను పెదవులకు ఆనించి ఊదడం ప్రారంభించాలి. అయితే గాలి ఊదే క్రమంలో గాలిని మీ బుగ్గల నిండా నింపేయవద్దు. ఊపిరితిత్తుల నుంచి శంఖంలోకి వెళ్లేలా చూసుకోవాలి.
ఇలా నెమ్మదిగా, స్థిరంగా ఊదుతూ శంఖనాదాన్ని పెంచుతూ పోవాలి. ఈ క్రమంలో ఊపిరితిత్తులు, ముఖం కండరాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
శంఖం ఊదేటప్పుడు స్థిరమైన లయ, దీర్ఘమైన శ్వాస కొనసాగేలా చూసుకోవాలి. ఇలా చేస్తే నాదంలో నాణ్యత ఉంటుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఇలా రోజూ సాధన చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస ప్రభావవంతంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం
సమకూరుతుంది.
ఇక శంఖాన్ని పూరించేటప్పుడు నోటిద్వారా శ్వాసించకూడదు. ముక్కు ద్వారానే శ్వాసించాలి.