News

ఇక ఉజ్జయినిలోని దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి: మేయర్

70views

కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు నేమ్‌ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పుడు అదే దాదిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా ఉజ్జయినిలోని హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్‌, ఫోన్‌ నంబర్‌ను కూడా జతచేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు జరిమానా విధిస్తామని, వారి స్టాల్స్‌ను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ముస్లింలు తమ లక్ష్యం కాదని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు.

‘‘ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేమ్‌ప్లేట్‌లు ఒకే పరిమాణం, రంగులో ఉండాలని మొదట చెప్పినందుకు అమలులో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఈ నిబంధనలు సడలించాం. దుకాణాల యజమానులు వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రదర్శిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉజ్జయిని హిందువులకు పవిత్రమైన నగరం. దుకాణాల యజమానుల వివరాలు తెలుసుకునే హక్కు భక్తులకు ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.