News

ఏపీలో భారీ వర్షాలు.. దేవీపట్నంలో మునిగిన గండిపోచమ్మ ఆలయం

52views

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది.

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో రాకపోకలు స్తంభించాయి. చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వరద ప్రవహిస్తోంది. చట్టి వద్ద జాతీయ రహదారి-30 పైకి శబరి నది వరద చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు స్తంభించాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి, నిమ్మలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కోతకు గురైన జాతీయ రహదారి

వరద ఉద్ధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురైంది. జాతీయ రహదారిపై వరద చేరికతో ఒడిశా-ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కల్లేరు, కుయిగూరు మధ్య జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర వరద నీరు చేరింది. చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 38.1 అడుగులకు చేరింది. డొంకరాయి జలాశయం నిండుకుండలా మారింది. దీని గరిష్ఠ నీటిమట్టం 940 అడుగులు కాగా.. ప్రస్తుతం 939.50 అడుగులకు చేరుకుంది. సోకులేరు, చీకటి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చింతూరు-వరరామచంద్రాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల సంగమంతో వరద ఉద్ధృతి పెరిగింది. నదుల ఉద్ధృతితో కూనవరం మండలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల వల్ల కూనవరం-భద్రాచలం, భద్రాచలం-చింతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి

విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. 7,96,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నంచి శ్రీశైలానికి 97,208 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 817 అడుగులకు చేరింది.