News

కన్వర్‌ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..

62views

కన్వర్ యాత్ర మార్గంలో అన్ని హోటళ్లు తమ యజమానుల పేర్లను తప్పక ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.. ప్రతి హోటళ్లు.. అది రెస్టారెంట్ అయినా, రోడ్‌సైడ్ దాబా అయినా, లేదా ఫుడ్ కార్ట్ అయినా యజమాని పేరును ప్రదర్శించాల్సిందేనని పేర్కొన్నారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది.

కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లకు యజమానుల పేర్లు, మొబైల్‌ నెంబర్‌, క్యూ ఆర్‌ కోడ్‌ను.. బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. కన్వర్‌ యాత్రకు వెళ్తున్నవారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. హిందూ పేర్లతో ముస్లింలు మాంసాహారాన్ని యాత్రికులకు విక్రయిస్తున్నారని మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్‌ ఆరోపించారు. వైష్ణో ధాబా భండార్, శాకుంభరీ దేవి భోజనాలయ, శుద్ధ్ భోజనాలయ వంటి పేర్లను రాసి మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

కాగా జులై 22 నుంచి కన్వర్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు.