News

అమర్ నాథ్ యాత్రలో భక్తుల కోలాహలం…

44views

అమర్‌నాథ్‌లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి ఆదివారం నాడు 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం నాటికే  2,93,929 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

అమరనాథుడి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు పయనం అయ్యారు. పహల్గాం మార్గంలో 109  వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలారు. ఆగస్టు 19న అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది. 

భారతదేశంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమర్ నాథ్ ఒకటి . ప్రతీ ఏటా ఇక్కడ మంచు లింగంగా ఏర్పడే మహాశివుడిని భక్తులు దర్శించుకుంటుంటారు. గుహలో మంచుతో ఏర్పడే లింగాకృతిని భక్తులు శివుడి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు.

శ్రీనగర్ నుంచి అమర్ నాథ్ క్షేత్రం 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుడు హిమాలయాలకు వెళ్ళే దారిలో, తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి దగ్గర, నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని భక్తులు విశ్వసిస్తారు.