ArticlesNews

తరింపజేసే తీర్థయాత్రలు

47views

ఆధ్యాత్మిక సాధనా సోపానంలో తీర్థయాత్ర అనేది తొలిమెట్టు లాంటిది. మనసును పరమాత్ముడు, పారమార్థికత వైపు మరలించేందుకు పుణ్యయాత్రలు ఎంతగానో ఉపకరిస్తాయి. లౌకిక ఆలోచనల నుంచి పారలౌకిక చింతన దిశగా పురోగమించటమే తీర్థయాత్రల పరమ ఉద్దేశం.

‘తీర్థయాత్రలు, దివ్యక్షేత్రాల సందర్శన యుక్తవయసులోనే చేయాలి. వార్ధక్యంలో శరీరం, మనసు కూడా సహకరించవు’ అన్నారు రామకృష్ణ పరమహంస ధర్మపత్ని, రామకృష్ణ సంఘ గురువు శారదాదేవి. కనుక యుక్తవయసులోనే యాత్రలకు ఉపక్రమించాలి. ఈ శరీరంతో చేసే పాపాలు.. శారీరకంగా శ్రమిస్తూ పుణ్యప్రదేశాలకు వెళ్లడం వల్ల ఉపశమిస్తాయని మహర్షులు ఉటంకించారు.

తెలిసీ తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పుణ్యక్షేత్రాల సందర్శనమని మన పురాణాలు పేర్కొన్నాయి. పరశు రాముడి తీర్థయాత్రలే ఇందుకు నిదర్శనం. అతని తండ్రి జమదగ్ని ఆశ్రమం నుంచి కార్తవీర్యాన్జునుడు అనే రాజు దౌర్జన్యంగా కామధేనువును తీసుకెళ్లాడు. ఆ కోపంతో పరశురాముడు కార్తవీర్యుణ్ణి సంహరించాడు. అది చూసిన జమదగ్ని- ‘బ్రాహ్మణులకు క్షమించడమే ధర్మం. రాజును చంపటం బ్రహ్మహత్య కంటే మహాపాపం. ప్రాయశ్చిత్తంగా పుణ్య ప్రదేశాలకు వెళ్లిరా!- అంటూ పుత్రుణ్ణి ఆదేశించాడు. అలా పరశు రాముడు ఏడాదిపాటు తీర్థక్షేత్రాలు పర్యటించాడు.

హైందవ ధర్మంలో తీర్థయాత్రలకు విశేష ప్రాధాన్యముంది. ఆధ్యాత్మిక ప్రస్థానం కేత్ర పర్యటనలతో ఆరంభించి, అంతరంగిక జపధ్యానాదులకు చేరుకోవాలని, తుదకు ఆత్మసాక్షాత్కారంతో అంతం కావాలని మహర్షులు అనుభవపూర్వకంగా ప్రబోధించారు. ఆధ్యాత్మిక జీవనాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేయటంలో తీర్థయాత్రలు ఘనతరమైన పాత్రను పోషించినట్లు చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. యజ్ఞయాగాలు, వేదాధ్యయనం, జపధ్యానాలు, వైదిక పరమైన క్రతువులు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ తీర్థక్షేత్ర దర్శనం అనేది కుల, వర్ణ, లింగభేదాలకు అతీతంగా ఆధ్యాత్మిక పురోగతికి సాయపడింది.

ఆధ్యాత్మిక చింతనకు ఆలంబన
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దాయాదులైన దుర్యోధనాదులను రణరంగంలో తుదముట్టించినందుకు ధర్మరాజు చింతించాడు. పాపపరిహారంగా శ్రీకృష్ణ భగవానుడిని యజ్ఞపురుషుడిగా భావించి యాగాలు చేశాడు. మహాభారత యుద్ధాన్ని చూడలేక తీర్థయాత్రలకు వెళ్లి, పారమార్థిక జ్ఞానాన్ని పొందిన విదురుడు అప్పుడే హస్తినాపురానికి వచ్చాడు.విదురుడు తన మానసిక పరిణతికి, ఆధ్యాత్మిక చింతనకు పుణ్య యాత్రలు ఎలా తోడ్పడ్డాయో వివరించి, జ్ఞానబోధ చేశాడు. క్షేత్ర, తీర్థ దర్శనాలతో పారమార్థిక సంపన్నుడైన విదురుడు- ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవిలకు అనేక అంశాలు ప్రబోధించి, ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచాడు.

స్థల ప్రభావం
తీర్థాలు, క్షేత్రాల దర్శనంతో మానసిక, శారీరక స్వస్థత చేకూరుతుందని ధర్మగ్రంథాలు పేర్కొన్నాయి. మనది వేదభూమి. భగవంతుడు తన లీలల్ని ప్రదర్శింజేసిన పుణ్యభూమి. అందుకే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సంచరించిన ప్రదేశాలు పుణ్య స్థలాలుగా విరాజిల్లుతున్నాయి. ‘విగ్రహం లేనిదే నిగ్రహం కుదరదు’ అన్న దివ్య దృష్టితో భగవంతుడు చాలా చోట్ల స్వయంభువుగా వెలిశాడని, అవి మహిమాన్వితమని పురాణ వచనం. అందుకే వాటిని దర్శించినపుడు.. మనపై ఆ ప్రతిమల అనుగ్రహం వర్షిస్తుంది. అలాగే మహర్షులు, సిద్ధపురుషులు జపతపాలు ఆచరించిన ప్రాంతాలు, గుహలు కూడా ప్రభావవంతమైనవి. ఆ ప్రదేశాలను సందర్శించినప్పుడు అప్రయత్నంగానే మనలో ఆధ్యాత్మిక బీజాలు నాటుకుంటాయి.
తలపులు మారితేనే తీర్థయాత్రా ఫలం

‘తీర్థయాత్రలు చేసినప్పటికీ భక్తి, వివేక, వైరాగ్యాలు కలగకపోతే యాత్రాఫలం దక్కనట్లే! కాశీకి వెళ్లి గంగలో మునిగినంత సేపు మన పాపాలు ఆ తీరంలోని చెట్లపై కూర్చుంటాయి. ఒడ్డుకు రాగానే మళ్లీ వచ్చి మనపై వాలిపోతాయి’ అనేవారు రామకృష్ణ పరమహంస. పవిత్ర క్షేత్రాలను విహార ప్రాంతాలుగా భావించకూడదని మన ధర్మగ్రంథాలు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆధ్యాత్మికశక్తిని గ్రహించాలంటే, భక్తిశ్రద్ధలతో పాటు ఆ పవిత్ర స్థలాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. మౌనంగా, ఏకాంతంగా ధ్యానం ఆచరించాలి. అక్కడ ఆరాధనలు అందుకునే దేవతామూర్తితో మమేకం కాగలగాలి. కోరికల చిట్టాతో కాకుండా.. పారమార్థిక జిజ్ఞాసతో, పరమాత్మపై ప్రేమతో పర్యటించాలి. పుణ్య ప్రదేశాలను దర్శించి నప్పుడు మనలో భగవంతుడి పట్ల ఒక అనిర్వచనీయమైన ఆరాధనాభావం జనిస్తుంది. అందుకు మొదటి నుంచీ మనసును సిద్ధం చేసుకోవాలి. అంతరంగంలో ఆనంద సుక్షేత్రాన్ని ఏర్పరచుకోవాలి. ఆది శంకరాచార్యులవారు ‘భజగోవిందం’లో..

కురుతే గంగాసాగర గమనం, వ్రతపరిపాలనం
అథవా దానమ్‌
జ్ఞానవిహీనః సర్వమతేన, ముక్తిం న భజతి
జన్మ శతేన

… అన్నారు. గంగానదిలో స్నానం చేసినా, దానధర్మాలు, వ్రతాలు ఆచరించినా, ‘జ్ఞానం’ కనుక లేకుంటే వంద జన్మలెత్తినా ముక్తి లభించదని భావం. ఈ బాహ్య ఆచారాలన్నీ పారమార్థిక సాధనలో ప్రాథమిక అంశాలే! వీటి నుంచి జ్ఞానంతో మరింత ముందుకు వెంటనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుంది.