ArticlesNews

భక్త కోటి సేవలో..

46views

శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో దేవస్థానం విస్తృత సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైనా.. ఏదైన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినా.. దాదాపు 60 కి.మీ దూరంలో ఆంధ్రా వైపు దోర్నాల, తెలంగాణ వైపు అచ్చంపేట ఆసుపత్రికి తరలించాల్సి వచ్చేది. దీంతో అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం 1980 ఫిబ్రవరి 15వ తేదీన ఉచిత వైద్యశాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఇందులో 24 గంటల పాటు నిరంతరంగా సేవలు అందుతున్నాయి. వైద్యశాల నిర్వహణకు దేవస్థానం

హైదరాబాద్‌కు చెందిన అపోలో హాస్పిటల్‌ సహకారాన్ని తీసుకుంటోంది. అపోలో వైద్యశాల తరుఫున వైద్యులు, నర్సులు సేవలందిస్తున్నారు. అపోలో వైద్యులకు దేవస్థానం ఉచిత వసతి, భోజనం తదితర ఏర్పాట్లను కల్పిస్తుంది. దేవస్థానం తరుపున ల్యాబ్‌ టెక్నిషియన్‌–1, గుమస్తా–1, అంబులెన్స్‌ డ్రైవర్లు–2, ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వైద్యశాలలో రోజుకు సగటున 150 మంది దాకా ఆయా వైద్యసేవలను పొందుతున్నారు. మహాశివరాత్రి, ఉగాది, కార్తీక మాసాల్లో అధికసంఖ్యలో భక్తులు వైద్యసేవలు పొందుతున్నారు. సంవత్సరంలో సుమారుగా మొత్తం 80 వేల మందికి పైగా వైద్యసేవలు అందుతున్నాయి.

ప్రత్యేక వైద్యపరికరాలు..
శ్రీశైల దేవస్థాన వైద్యశాలలో ఈసీజీ, కార్డియాక్‌ మానిటర్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, వెంటిలేటర్‌. డిఫిబ్లేటర్‌, కార్డిక్‌ మానిటర్‌, బైపాస్‌ మిషన్‌, నెబులైర్‌, సెక్షన్‌పంపు లాంటి సదుపాయాలతో పాటు రక్తపరీక్షలకు సంబంధించి సీబీపీ కౌంటింగ్‌, సెమీ అనలైజర్‌, మొదలైన అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యపరంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన తక్షణ వైద్యాన్ని అందించి, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పంపించేందుకు 3 అంబులెన్స్‌లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి అత్యంత అధునాతనమైన పరికరాలతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడనుంది.

నిర్వహణకు ఏటా రూ. 50 లక్షలు
వైద్యశాల నిర్వహణ కోసం దేవస్థానం సంవత్సరానికి రూ.50 లక్షలను కేటాయిస్తోంది. వైద్యశాలలో మందులన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్ల ద్వారా వైద్యశాలకు అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నారు. వీటికి తోడు దాతల నుంచి కూడా మందులను విరాళంగా పొందుతున్నారు. వైద్యశాల నిర్వహణ కోసం దేవస్థానం కొంత మూలధనంతో పాటు శ్రీభ్రమరాంబా మల్లికార్జున ప్రాణధాన ట్రస్ట్‌ పేర ప్రత్యేక ట్రస్టును కూడా నెలకొల్పింది. సమయానుసారంగా దేవస్థానం ఆయా విభాగాలలో ప్రత్యేక నైపుణ్యం గల వైద్యులను రప్పించి వైద్యశిబిరాలను కూడా నిర్వహిస్తుంది.

ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వండి
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున ప్రాణదాన ట్రస్ట్‌ పేర ప్రత్యేకంగా ట్రస్ట్‌ను నెలకొల్పాం. ఈ ట్రస్ట్‌కు దాతలు ఎంత మొత్తాన్ని అయినా విరాళాంగా ఇవ్వవచ్చు. ఔషధ తయారీదారులు, మందుల దుకాణాల నిర్వాహకులు, మెడికల్‌ ఏజెన్సీలు వైద్యశాలకు అవసరమైన మందులను విరాళంగా అందజేయవచ్చు. అలాగే దాతలు వైద్యపరికరాలను కూడా విరాళంగా ఇవ్వొచ్చు. వైద్యసేవ పథకానికి రూ.లక్ష ఆపై మొత్తాన్ని విరాళంగా ఇచ్చే వారిని దేవస్థానం ప్రత్యేక దాతలుగా గుర్తిస్తుంది.– డి.పెద్దిరాజు,శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి