News

రత్నగిరిపై వానాయాతన

91views

ఎడతెరిపి లేకుండా రోజంతా కురిసిన వర్షంతో రత్నగిరి అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం భక్తులు నానా యాతనలూ పడ్డారు. వర్షంలో తడవకుండా సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యారు. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం నుంచి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు వర్షంలో తడవకుండా ఉండేందుకు ఎక్కడా షెల్టర్‌ లేదు. ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రీన్‌ షేడ్‌ నెట్‌ ఉన్నప్పటికీ అది ఎండల నుంచి మాత్రమే రక్షణ ఇస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే దానికి ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా వాన నీరు కారిపోయి, భక్తులు తడిసిపోతూంటారు. భక్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరోవైపు వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ఆలయం వద్ద నిర్మించిన లిఫ్ట్‌ వరకూ వెళ్లాలన్నా కూడా తడవక తప్పని పరిస్థితి. లిఫ్ట్‌లో పైభాగానికి చేరుకున్నాక.. అక్కడి నుంచి ఆలయం వరకూ రేకుల షెడ్డు ఉంది. కానీ ఆ షెడ్డుకు మధ్యలో రంధ్రాలు ఉండటంతో వాన నీరు కారిపోతోంది. దీంతో నేలంతా తడిసిపోయి, వృద్ధులు, దివ్యాంగులు జారి పడిపోయే పరిస్థితి తలెత్తుతోంది.

విశ్రాంతి షెడ్డు లేక..
పశ్చిమ రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి గత ఏడాది లారెల్స్‌ ఫార్మాస్యూటికల్‌ ల్యాబ్‌ ముందుకు వచ్చింది. రూ.2 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించడానికి వీలుగా అక్కడ ఉన్న 60 గదుల సత్రాన్ని కూల్చేశారు. ఇది జరిగి దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ అక్కడ విశ్రాంతి షెడ్డు నిర్మాణం జరగలేదు. దేవస్థానం బస్సులు భక్తులతో అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తూంటాయి. ఎండాకాలంలో అక్కడ షామియానాలు వేస్తున్నారు. వర్షాకాలంలో షామియానాలు ఉన్నప్పటికీ భక్తులు తడవక తప్పడం లేదు. పలువురు భక్తులు అదేవిధంగా తడిసిపోయారు. నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠా పూజల కోసం ఆలయం ముందు ఏప్రిల్‌లో వేసిన తాటాకుల పాకలో కొంతమంది భక్తులు తలదాచుకున్నారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణంతో పాటు ఆలయ ప్రాకారంలో కూడా గ్రీన్‌ షేడ్‌కు బదులు ఎండ, వానల నుంచి రక్షణనిచ్చేలా షెడ్లు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.